Inspector Harassment: వేధింపులు అనేవి సాధారణ ప్రజలకు రావడం సర్వసాధారణం. కానీ ఇవే వేధింపులు ఒక పోలీసు అధికారికి వస్తే.. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను ఒక మహిళ పదే పదే వేధించడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై అధికారులు కేసు నమోదు చేశారు.
READ ALSO: Messi-Vantara: వంటారాను సందర్శించిన మెస్సీ.. ఫొటోలు వైరల్
వివరాల్లోకి వెళ్తే.. రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సతీష్ జిజె.. ఆగస్టు 19 నుంచి ఆ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌కు అక్టోబర్ 30న తన అధికారిక ఫోన్‌కు తెలియని నంబర్ నుంచి పదేపదే వాట్సాప్ కాల్స్ రావడంతో వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ఆ కాల్‌కు సమాధానం ఇచ్చిన తర్వాత కాల్ చేసిన మహిళ తనను తాను రామమూర్తి నగర్ నివాసి అయిన సంజన అలియాస్ వనజగా పరిచయం చేసుకున్నట్లు తెలిపారు. ఆమె తాను ఇన్‌స్పెక్టర్ సతీష్ జిజెని ప్రేమిస్తున్నానని, ఆయన తన ప్రేమను అంగీకరించేలా చూడమని, అలాగే అసభ్యకరంగా మాట్లాడిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
అయితే ముందు ఇది ఎవరో కావాలని ఆట పట్టిస్తున్నట్లుగా అనుకున్నానని, కానీ ఈ కాల్స్ ఆగకుండా కొనసాగాయని, ఆ మహిళ అనేక ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసి వేధించడం ప్రారంభించిందని తెలిపారు. చివరికి తాను వాటన్నింటినీ బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ మహిళ కొత్త నంబర్‌తో ఫోన్ చేస్తూ వేధించేదని అన్నారు. నవంబర్ 7న కాల్స్ చేసి వేధిస్తున్న ఆ మహిళ తన కార్యాలయానికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుంటుండగా ఒక కవరును అందించిందని తెలిపారు. ఆ కవరు లోపల “నెక్సిటో ప్లస్” అని లేబుల్ చేసిన మూడు అక్షరాలు, 20 మాత్రలు ఉన్నాయని వెల్లడించారు. ఆ లేఖలో తన ప్రేమను అంగీకరించకపోవడంతో, తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన చావుకు ఇన్స్పెక్టర్ బాధ్యత వహిస్తారని ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇందులో ఒక నోట్ ఉందని, అందులో హార్ట్ సింబల్ ఉందని, అందులో “చిన్నీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ” అని రక్తంతో రాసి ఉందని పేర్కొన్నారు. ఈ నోట్‌ను ఆ మహిళ తన సొంత రక్తంతో రాసినట్లు ఇందులో పేర్కొందని వెల్లడించారు. ఆ మహిళ వేధింపులు భరించలేక ఇన్‌స్పెక్టర్ సతీష్ అధికారికంగా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
