Site icon NTV Telugu

MadhyaPradesh: బోరింగ్ కొడితే చాలు.. బక్కెట్ల కొద్ది బీరు.. అవాక్కైన పోలీసులు

Guna 2

Guna 2

MadhyaPradesh: ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యమే అనడంతో సందేహమే లేదు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ మద్యాన్ని తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని నివారించేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆ కొద్ది కాలమే.. మళ్లీ యధావిధిగా తయారీ, సరఫరా జరుగుతూనే ఉంటోంది. కానీ ఎక్కడా లేని విధంగా చేతిపంపు కొడితే మద్యం వచ్చేలా సెట్ చేసిన మద్యం అక్రమ తయారీదారుల ఉపాయానికి మెచ్చుకోవాల్సిందే. అయితే, ఆ మధ్య కాలంలో ఏపీలోని గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆయిల్‌ లాంటి ద్రవం ఉద్భవించినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ, ఇక్కడ మాత్రం హ్యాండ్ పంప్‌ను వాడిన ప్రజలకు బక్కెట్ల కొద్దీ మద్యం బయటకు వస్తుంది. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగు చూసింది.

Read Also: Viral Video: బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న ఏనుగు.. స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్లు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు గుణలో దాడి చేయగా, వారికి ఒక చేతి పంపు దొరికింది. దాని నుండి నీరు కాదు, మద్యం బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అక్రమ మద్యం అమ్మకాల కోసం ఎవరికీ అనుమానం రాకుండా ఓ చేతి పంపును ఏర్పాటు చేశారు. పోలీసులు చేతి పంపు కొట్టి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం రావటంతో ఖాకీలు కంగుతిన్నారు. అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురాలో నిందితులు ట్యాంక్‌ను భూమిలో పాతిపెట్టి చేతి పంపును అమర్చారు. పోలీసులు చేతిపంపు కొట్టగానే అందులో నుంచి మద్యం రావడం మొదలైంది. వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Exit mobile version