NTV Telugu Site icon

Nithya Pellikoduku: చదివింది తొమ్మిది.. మోసాలలో మాత్రం పీహెచ్‌డీ చేశాడు.. నిత్య పెళ్లికొడుకు ఆటకట్టించిన పోలీసులు

Crime News

Crime News

Nithya Pellikoduku: చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడొక నిత్య పెళ్ళికొడుకు. ఇస్రోలో హెచ్‌ఆర్ ఉద్యోగం అని చెబుతూ.. వందల ఎకరాల పొలాలు, విల్లాలు ఉన్నాయని … పెళ్లికూతుళ్ల కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చి లక్షలకు లక్షలు దోచేస్తున్న ఆ ప్రబుద్ధుడి ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారు పేటకి చెందిన ఆశం అనిల్ బాబు పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలో వివరాలు నమోదు చేశాడు. చదివింది తక్కువ.. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోవడంతో సంబంధాలు రాలేదు. వచ్చిన కట్నంతో విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకున్న ఆసం అనిల్ బాబు కాస్తా కళ్యాణ్ రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. అదే పేరుతో మ్యాట్రిమోనీలో తాను ఒక ఇస్రో హెచ్‌ఆర్ ఉద్యోగిగా  100 ఎకరాల పొలం హైదరాబాద్, బెంగళూరులో రెండు విల్లాలు ఉన్నట్టుగా వివరాలు నమోదు చేశాడు. హై ప్రొఫైల్ చూసి సంబంధం కలుపుకుందామని వచ్చిన వారికి అనిల్ అలియాస్ కళ్యాణ్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడేవాడు. తాను అనిల్ తండ్రినని, తన భార్య అమెరికాలో పనిచేస్తుందని తమకు మంచి అమ్మాయి దొరికితే చాలు కట్నకానుకలు ఏమీ అవసరం లేదంటూ నమ్మించేవాడు. ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా బెంగళూరులో ఒక విల్లా అద్దెకు తీసుకుని బౌన్సర్లను బంధువులను సైతం అద్దెకు తెచ్చుకునే వాడు. అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోతున్నామంటూ తన కొడుకుని పెళ్లి చూపులకు పంపిస్తానంటూ నమ్మబలికేవాడు. వీటితోపాటు పెళ్లికూతురు తరుపున చదువుకున్న వారికి ఇస్రోలో ఉద్యోగాలు సైతం ఇప్పిస్తానంటూ లక్షలకు లక్షలు వసూలు చేశాడు. ఇదంతా నిజమని నమ్మిన పెళ్లికూతురు తరపు బంధువులు ఉద్యోగాల కోసం డబ్బులు సైతం చెల్లించారు. వారిని నమ్మించడానికి ఫేక్ అపాయింట్మెంట్లు తయారుచేసి వారికే పంపించేవాడు.

Read Also: CM Chandrababu: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో భేటీ

వసూలు చేసిన డబ్బుని తన సొంత బ్యాంకు అకౌంట్లకు కాకుండా అనేక రకాల అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి సమయాలలో తల్లితండ్రులుగా బందువులుగా ఇతర వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. అద్దెకు తీసుకున్న విల్లాలను  చూపించి నా సొంత విల్లా అని చెప్పి నమ్మిస్తూ ఉంటాడు. ఇలా నమ్మించడానికి హైదరాబాద్ శివారు చేవెళ్లలో ఒక ఫామ్ హౌస్,  బెంగూళూర్‌లో ఒక విల్లాను అద్దెకు తీసుకున్నాడు. హైదరాబాద్‌లో ఒక పీఏ, ఒక వాచ్ మన్, ఒక లేడీ అసిస్టెంట్, ఇద్దరు బౌన్సర్లు ఉంటారు. మోసం చేసే ముందు వారిని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అంతే కాకుండా ఇతనికి సలహాలు ఇవ్వటానికి కాశీ అనే వ్యక్తి, పెళ్లి చేసే పంతులు సైతం అంతా పక్క సెటప్ రెడీగా ఉంటుంది. ఇదేవిధంగా ఏలూరు జిల్లా  భీమడోలు మండలం, గుండు గొలను గ్రామానికి చెందిన గుండా లక్ష్మీ కుమారిని నమ్మించి వాళ్ళ రెండవ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని.. మూడో అమ్మాయికి ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని  వారి వద్ద నుండి దఫాదఫాలుగా ఆన్‌లైన్‌ ద్వారా సుమారు 9,53, 000  రూపాయలు తీసుకుని  మోసం చేశాడు.

మోసపోయిన వారికి అనుమానం రాకుండా గతంలో తాను పెళ్లి చేసుకున్న శశాంక అనే అమ్మాయిని హెచ్ఆర్ మేనేజర్‌గా చెబుతూ ఇంటర్వ్యూ చేయించి ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు  భీమడోలు పోలీస్ స్టేషన్‌లో 2023లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై అప్పటినుంచి ఫోకస్ పెట్టిన పోలీసులు నిందితుడిని అతడు చేస్తున్న మోసాలను వెలుగులోకి తీసుకొచ్చారు.మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్ చూసి ఆడపిల్లల కుటుంబ సభ్యులు మోసపోవద్దని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచిస్తున్నారు. ఇస్రో ఉద్యోగిగా కళ్యాణ్ రెడ్డి చేసిన మోసాలను మీడియాకి వివరించారు.

ఇప్పటి వరకు సుమారుగా కోటిన్నర రూపాయలు తీసుకుని కొంత మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డితో పాటు  తుంగ శశాంక, డ్రైవర్ పల్లె హేమంత్ రెడ్డిలను అరెస్టు చేయడంతో పాటు రెండు లక్షల నగదు, ఒక కారు, మోసాలు చేయడానికి ఉపయోగించిన ఐదు సెల్ ఫోన్లు,  13 సిమ్ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఇతర డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.