PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్‌ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!

Pok

Pok

PoK Protests: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో రాజకీయ సంక్షోభం మరోసారి భీకర రూపాన్ని దాల్చింది. నియంత్రణ రేఖ (LoC)కు సమీపంలో వేలాది మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టడం ఇస్లామాబాద్‌ను వణకిస్తోంది. “పీఓకే అనేది పాకిస్థాన్‌‌లో భాగం కాదు.. మాకు పాకిస్థాన్‌ అవసరం లేదు” అంటూ వేలాది మంది నిరసనకారులు గొంతుకలిపారు. తమకు ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఇస్లామాబాద్ ఇబ్బందులకు గురిచేస్తే, తాము ఇతర దారులు ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌తో ముడిపెడుతున్నారు విశ్లేషకులు. భారత్‌తో సత్సంబంధాల వైపు పీఓకే మొగ్గు చూపుతోందని రాజకీయ వర్గాలలో విస్తృతంగా విశ్లేషిస్తున్నారు. తాజాగా రావలకోట్‌లోని ఈద్గా గ్రౌండ్‌లో జరిగిన ఈ భారీ ప్రదర్శన, ఈ ప్రాంతంపై పాకిస్థాన్‌ నియంత్రణకు ఇప్పటివరకు ఎదురైన అత్యంత బలమైన సవాలుగా నిలిచింది. దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వం తమను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తోందని, ఆర్థికంగా దోపిడీకి గురిచేస్తూ పరిపాలనాపరమైన అణచివేతకు పాల్పడుతోందని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ ప్రజా ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు పాక్ అధికారులు నిత్యావసర సరుకుల రవాణాను నిలిపివేసి ఘోరమైన దిగ్బంధనం (బ్లాకేడ్) విధించారని మండిపడ్డారు.

‘మాకు పాకిస్థాన్‌ అవసరం లేదు’

ఈ వేలాది మంది నిరసనకారులను ఉద్దేశించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేత సర్దార్ అమ్మన్ ఖాన్ నిప్పులు చెరిగారు. పీఓకేకు పాకిస్థాన్‌‌తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పీఓకే అసలు పాకిస్థాన్‌‌లో భాగమే కాదు. తమకు పాకిస్థాన్‌ అవసరం లేదు, నిజానికి పాకిస్థాన్‌‌కే పీఓకే అవసరం ఎంతైనా ఉంది అని ఖాన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చప్పట్లతో మద్దతు పలికారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ జెండాలను ఊపారు. గత మూడు వారాలుగా రావలకోట్ పరిసరాల్లో అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు నిరంతరాయంగా ధర్నా కొనసాగిస్తున్నారు.

ఇతర దారులు తెరుస్తాం జాగ్రత్త!

జూన్ 9 నుంచి ఎల్‌ఓసీ (LoC) వద్ద ఉన్న జీరో పాయింట్ (సీజ్‌ఫైర్ లైన్) వద్ద మహిళలు, పిల్లలతో సహా కాశ్మీరీలు పడిగాపులు కాస్తున్నారని అమ్మన్ ఖాన్ పేర్కొన్నారు. కశ్మీరీలను ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణచివేయాలని పాక్ చూస్తోందని ఆరోపించారు. “మాకు మీ రేషన్ అవసరం లేదు. మీరే ఆలోచించుకోండి – అవసరం మీది. మిగిలిన వ్యాపార మార్గాలు, ఇతర దారులు తెరుచుకునే పరిస్థితి తీసుకురాకండి. ఆ తర్వాత మమ్మల్ని ఇక్కడే ఉండిపొమ్మని మా కాళ్లు పట్టుకుని బతిమాలే రోజులు వస్తాయి” అంటూ పరోక్షంగా భారత్ వైపు ఉన్న దారులను ప్రస్తావిస్తూ హెచ్చరించారు. ఇది ప్రజల పాలన అని, ఇక్కడ ఎలాంటి మార్షల్ లా లేదా డిక్టేటర్ లేరని పాలకులకు గుర్తుచేశారు. “కోతి చేతికి అగ్గిపెట్టె ఇస్తే ఎలా తగలబెడుతుందో, అలాగే కొంతమంది చేతికి మొబైల్ ఫోన్లు, ట్విట్టర్ (ఎక్స్) ఇచ్చారు. కశ్మీరీలు ముందుగా తమ నమ్మకాన్ని నిరూపించుకోవాలని వారు వాగుతున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌ సొత్తు కాదు, అది పాక్ ఆస్తి అంతకన్నా కాదు” అని ఖాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అసలు వివాదం ఏంటి?

ఆహార ధాన్యాలు, పిండి, ఇతర నిత్యావసర వస్తువులను పీఓకేలోకి రాకుండా పాక్ అధికారులు నిలిపివేయడంతోనే ఈ ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. నిత్యావసరాల కొరత సృష్టించి, ఆర్థిక ఒత్తిడి పెంచి ప్రజలను లొంగదీసుకోవాలని పాక్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ ఉద్యమం ద్రవ్యోల్బణం, విద్యుత్ ధరలు, నిరుద్యోగం, సబ్సిడీల రద్దు, దశాబ్దాల రాజకీయ వివక్ష వంటి 38 డిమాండ్ల చార్టర్‌తో ముందుకు సాగుతోంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పాక్ పాలకులు దీన్ని భద్రతా సమస్యగా పరిగణిస్తున్నారు. ఆందోళనలను అణచివేయడానికి ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC) సంస్థపై నిషేధం విధించడమే కాకుండా, అమ్మన్ ఖాన్‌తో సహా పలువురు కార్యకర్తలపై తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, ఈ నిరసన దృశ్యాలు, వీడియోలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ మొదటి వారం నుంచి పీఓకేలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.