NTV Telugu Site icon

PM Modi: తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తాం..

Pm Modi

Pm Modi

PM Modi: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, యాదాద్రీశుడిని నమస్కరిస్తూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదే గ్రౌండ్‌లో ప్రజలు ఆశీర్వదించడంతో ప్రధాని అయ్యానన్నారు పీఎం మోడీ. ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. ఎల్బీ స్టేడియంతో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాటి సభలో తన ప్రసంగం కోసం టికెట్‌ పెట్టారని.. భారత చరిత్రలో అది ఒక కొత్త ప్రయోగమన్నారు.

Also Read: Pawan Kalyan: ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత మోడీ

9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని ప్రధాని మండిపడ్డారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించిందని.. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ సీ టీమ్ అని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డీఎన్‌ఏలో 3 అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లక్షణాలు అంటూ ప్రధాని మోడీ విమర్శించారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదన్న ప్రధాని మోడీ.. నీళ్లు, నిధులు, నియామకాలు మరిచిపోయారన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోందన్నారు ప్రధాని. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది బీజేపీనేనని.. లోక్‌ సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీనే అంటూ ఆయన తెలిపారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీకి చెందిన తనను ప్రధానిని చేశారని వెల్లడించారు. కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చింది బీజేపీనే అంటూ వ్యాఖ్యానించారు. బీసీ యువతకు బీఆర్‌ఎస్‌ ఏమి చేయలేదన్నారు. బీసీలకు రూ.లక్ష ఇస్తామని బీఆర్‌ఎస్‌ వాగ్దానం చేసిందని.. కానీ ఆ వాగ్దానాన్ని బీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదన్నారు. మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు ప్రధాని మోడీ.

Also Read: Revanth Reddy: ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తాం..

బీఆర్‌ఎస్‌ నేతల్లో అహంకారం కనిపిస్తోందని ప్రధాని అన్నారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో సంబంధాలు ఉన్నాయని.. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి ప్రజలు తిడుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఎవరూ ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వాటిని తిరిగి రాబడతామన్నారు. అవినీతిని అంతం చేస్తామన్న ప్రధాని.. ఇది మోడీ గ్యారంటీ అన్నారు. అవినీతి చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యం టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ అయిందని ప్రధాని విమర్శించారు. అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్‌ అయిపోయాయన్నారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వా్న్ని సాగనంపాలా, వద్దా అంటూ ప్రశ్నించారు. ఒక తరం భవిష్యత్‌ను బీఆర్‌ఎస్‌ నాశనం చేసిందన్నారు. తెలంగాణలో వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్‌ అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఉచిత రేషన్‌.. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అని పేర్కొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌ రావాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.