NTV Telugu Site icon

PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఒకే స్ట్రోక్‌తో దేశంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం స్పందించిన ప్రధాని మోడీ.. ఆయనను ‘‘రాజ మాంత్రికుడు’’ అని ఎద్దేవా చేశారు. దేశం రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియాలో ఆదివారం ప్రధాని మోడీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వారు దేశాన్ని రక్షించలేరని అన్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం ఆయనను గౌరవించిందని మోడీ చెప్పారు. ‘‘ఒకే దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తానని కాంగ్రెస్ షెహజాదా చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ రాజమాంత్రికుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు..? అతని నానమ్మ(ఇందిరాగాంధీ) 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు’’ అని రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ విమర్శించారు. 2014కి ముందు పదేళ్లు రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించారని, ఇప్పుడు మాత్రం మంత్రదండం దొరికిందా..? అని ప్రశ్నించారు. సీపీఎం మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, పార్టీ పేరు చెప్పకుండా ఇండియా కూటమిలోని ఓ పార్టీ అణు నిరాయుధీకరణకు పిలుపునిచ్చిందని అన్నారు. బలపడలేని పార్టీ దేశాన్ని బలోపేతం చేస్తుందా..? అని మోడీ ప్రశ్నించారు.

Read Also: Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!

ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు తమ మేనిఫేస్టోలో ప్రమాదకరమైన హామీలను చేశాయని ఆరోపించారు. మనదేశాన్ని రక్షించుకోవడానికి అణ్వాయుధాలు ఉండాలి, లేకపోతే భారతదేశాన్ని రక్షించలేరు అని అన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ పుకార్లను పుట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగం వల్లే మోడీ ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఆదివాసీలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తించలేదని కానీ బీజేపీ ప్రభుత్వం వారిని గౌరవించిందని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఓ గిరిజన కుటుంబానికి చెందిన బిడ్డ దేశానికి రాష్ట్రపతి అయిందని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారం రద్దు చేసిందని ప్రధాని అన్నారు. రామ మందిరాన్ని నిర్మిస్తే, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశం మంటల్లో కూరుకుపోతుందని గతంలో వారు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ప్రేమ ఉందని చెప్పారు. దేశం ఏ వైపు ప్రయాణించాలో ఇండియా కూటమి నిర్ణయించుకోలేకపోతుందని విమర్శించారు.

Show comments