PM Modi: నేటితో రాహుల్ గాంధీకి 56 ఏళ్లు.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పీఎం మోడీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. జూన్ 19, 1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో జన్మించిన రాహుల్ గాంధీ.. నేటితో 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందజేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యాంగ ఆదర్శాల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అచంచలమైన నిబద్ధత, సమాజంలో అణచివేయబడిన వారి గొంతుకగా నిలుస్తూ చేస్తున్న పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోందని ఖర్గే కొనియాడారు.

అందరినీ కలుపుకునిపోయే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం, సామాజిక న్యాయం, సామరస్యం, కరుణ వంటి గుణాలు రాహుల్ గాంధీ నాయకత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని ఖర్గే పేర్కొన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, అధికార పీఠం ముందు నిజాన్ని మాట్లాడే ధైర్యం ఉన్న నాయకుడిగా సమాజంలో వెనుకబడిన, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం రాహుల్ ఎల్లప్పుడూ గళం విప్పారని గుర్తుచేశారు. దేశ సేవలో ఉన్న రాహుల్ గాంధీకి భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సంతోషాన్ని, మరింత శక్తిని ప్రసాదించాలని ఖర్గే ఆకాంక్షించారు.

×
×
Ad