PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం
చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోడీ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని థింపూలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రసంగించారు. ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటా.. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉంది’’ అని మోడీ పేర్కొన్నారు.
‘‘ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టం. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్రమూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్థరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచి వేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్‌కు వచ్చాను’’ అని మోడీ చెప్పారు.
