NTV Telugu Site icon

PM Modi: వికసిత్ భారత్ మాత్రమే కాదు.. వికసిత్ ఏపీ మా లక్ష్యం

Pm Modi

Pm Modi

PM Modi:  ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు. రాష్ట్రాల ఆశలు నెరవెరుస్తూ.. దేశం కోసం ఎన్డీఏ పని చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ ఏపీ ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ ఎన్డీఏ లక్ష్యమన్నారు.ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటుందన్నారు. పేదలకు సేవ, పేదల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమని ప్రధాని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టామన్నారు. ఏపీలో జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా లబ్ది పొందారన్నారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు మేలు చేకూరుస్తున్నామన్నారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని మోడీ కోరారు. మేం పేదల అభ్యున్నతికి కృషి చేస్తాం.. ఇది మోడీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.

“చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడింది.. చంద్రబాబు, పవన్‌ ఏపీ కోసం కష్టపడుతున్నారు.. ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది.. జూన్‌ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.” -ప్రధాని మోడీ

Read Also: Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది

ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని.. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఏపీని విద్యా కేంద్రంగా చేయాలని సంకల్పించామన్నారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించామన్నారు. ఎన్డీయేలో మేము అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట రోజున తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారని మోడీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారని.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ వ్యతిరేకించే వారన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ నిరంతరం తపించారని.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్‌ను ఇబ్బందులు పెట్టిందన్నారు. పీవీకి ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది, ఆయనను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసన్నారు. సిద్దాంతాలు కలవకున్నా.. కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరాయని.. ఇండియా కూటమికి దేశం మీద చిత్తశుద్ధి లేదని ప్రధాని విమర్శలు గుప్పించారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “ఏపీ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. ఎన్డీఏ ఏపీ ఆత్మగౌరవాన్ని కాపాడింది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేశాం. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇచ్చాం. ఎన్డీఏ పార్టీలకతీతంగా దేశ నేతలను గౌరవిస్తుంది. ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తేవాలి.. ఏపీలో ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని దించేయాలి. ఏపీ ప్రభుత్వం ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ మంత్రులు అవినీతి మీదే ఫోకస్ పెట్టారు. ఐదేళ్లల్లో ఏపీ అభివృద్ధి కుంటుపడింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అర్థమైంది. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు అనుకోవద్దు. రెండూ పార్టీలూ ఒకటే. రెండు పార్టీల్లోని నాయకత్వాలు ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వెళ్లేలా చేస్తున్నారు. ఏపీ ప్రజలు ఈసారి తప్పు చేయకూడదు. వచ్చే ఐదేళ్లల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏపీ అభివృద్ధి జరగాలంటే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లోని ఎన్డీఏ కూటమికే ఓటేయాలి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ప్రజాస్వామ్యంలో వెలుగులు వెలిగించేలా సెల్ ఫోన్లో లైట్లు వేయాలి.” అని ప్రధాని పేర్కొన్నారు.