NTV Telugu Site icon

PM Modi: కరోనా కథ ఇంకా ముగియలేదు, అప్రమత్తంగా ఉండాలి.. ప్రధాని కీలక సూచనలు

High Level Meeting

High Level Meeting

PM Modi: కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను పాటించాలన్నారు. కరోనా కథ ఇంకా ముగియలేదని, అందరూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందని అధికారులకు ప్రధాని గుర్తు చేశారు.

Read Also: Padma Awards 2023: ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం.. అవార్డులు అందజేసిన రాష్ట్రపతి

వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రధాని సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-మాస్క్​ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం-ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వైద్యులకు, ప్రజలకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధరించుకునేందుకు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు మోదీ తెలిపారు. ఏమైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Show comments