NTV Telugu Site icon

BRICS Summit: బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ సంభాషణలు

Brics Summit

Brics Summit

BRICS Summit: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ఒకరితో ఒకరు భేటీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతలు జోహన్నెస్‌బర్గ్‌లో వేదికను పంచుకున్నప్పుడు ఇద్దరు నేతలు పక్కపక్కనే నడుస్తూ కొద్దిసేపు సంభాషించుకోవడం గురువారం కనిపించింది. ఐదు దేశాల బ్రిక్స్ గ్రూపు తన సభ్యత్వాన్ని విస్తరించడానికి అంగీకరించి, మరో ఆరు దేశాలను కూటమిలో చేరమని ఆహ్వానించిన కొద్దిసేపటికే ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ మధ్య అనధికారిక సంభాషణ జరిగింది.

బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చుకోవడంపై అసలు ఐదుగురు సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ, సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ సమావేశమవుతారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినప్పటి నుంచి దాదాపు నాలుగేళ్లుగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగలేదు. శిఖరాగ్ర సదస్సు చివరి రోజైన నేడు ప్రధాని మోదీ ఐదు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇరాన్, ఇథియోపియా, మొజాంబిక్ దేశాల నేతలతో ఆయన సమావేశమవుతారు. అయితే ఈ రోజు ఆయన అధికారికంగా భేటీ కానున్న మరో రెండు దేశాల పేర్లను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Read Also: PM Modi: 2024 నుంచి బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలు

బ్రిక్స్ గ్రూపులోకి 6 కొత్త దేశాలు
ఇదిలా ఉండగా.. ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల దేశాలు సభ్యులుగా ఉన్న బ్రిక్స్‌ గ్రూపులోకి కొత్త సభ్యులను అంగీకరించడంపై బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా మధ్య అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం 5 దేశాలతో కొనసాగుతున్న బ్రిక్స్ కాస్త భవిష్యత్‌లో మరో 6 దేశాలు చేరనున్నాయి. దేశాల మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు, వాణిజ్య సంబంధాలను కొనసాగించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. బ్రిక్స్ సమావేశాల సందర్బంగా 2024 నుంచి బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలు చేరనున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ బ్రిక్స్ విస్తరణకు భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గ్రూపింగ్ విస్తరణను భారత్ స్వాగతిస్తున్నదని మోడీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా బ్రిక్స్‌లో మరో ఆరు కొత్త సభ్య దేశాల చేరుతున్నట్టు ప్రకటించారు. సిరిల్‌ రమాఫోసో కొత్త దేశాల చేరిక గురించి ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ ధృవీకరణను స్పష్టం చేశారు.

కొత్త సభ్య దేశాలను బ్రిక్స్ గ్రూప్‌లో భాగస్వాములుగా అంగీకరించడానికి భారతదేశం ఆసక్తిగా ఉందన్నారు. బ్రిక్స్ గ్రూప్‌ పూర్తి సభ్యత్వం కోసం ఆరు దేశాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్తగా బ్రిక్స్‌ లో చేరే దేశాలు అర్జెంటీనా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. అయితే ఇప్పటికే బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, చైనా, భారతదేశం, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.