గత కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దివంగత బీజేపీ నేతను గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మంగళవారం తమిళనాడు సేలంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ వరుసగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం తమిళనాడులోని సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నాయకుడు వి.రమేశ్‌ను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి తిరిగి ప్రారంభించారు. ఆడిటర్ రమేశ్‌ను ఎప్పటికీ తాను మర్చిపోలేనన్నారు. ప్రస్తుతం ఆయన మనతో లేరని. ఆయనో గొప్ప వక్త అని ప్రశంసించారు. రాత్రింబవళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. కానీ ఆయన హత్యకు గురి కావడం బాధాకరం అన్నారు. సభ సాక్షిగా ఆ దివంగత నేతకు నివాళి అర్పిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు.
వృత్తిరీత్యా ఆడిటర్ అయిన రమేశ్ గతంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2013 జులైలో ఆయనను నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇదే సభలో మరో బీజేపీ నాయకుడు కేఎన్ లక్ష్మణన్ సేవలను కూడా ప్రధాని గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో పార్టీ బలపడేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఇదిలా ఉంటే సేలం వేదికగా డీఎంకే, కాంగ్రెస్‌లపై కూడా మోడీ విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి పార్టీలు మహిళలు, హిందుత్వాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆ కూటమిని ప్రజలు ఓడిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు కట్టబెట్టాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా సౌతిండియాపై దృష్టి పెట్టిన మోడీ.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ కోసమే ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.