Site icon NTV Telugu

PM Modi: బెంగాల్‌లో అఘాయిత్యాలను ఆపగలిగే శక్తి బీజేపీకే ఉంది

Modi

Modi

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ గురువారం పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బీహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సందేశ్‌ఖాలీ ఘటనను మరోసారి ప్రధాని ప్రస్తావించారు. నిందితుడ్ని రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని మోడీ ఆరోపించారు. బెంగాల్‌లో మహిళలపై జరిగే దారుణాలు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలువరించగలదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని జైలుకు తరలిస్తామని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. దేశంలో బలమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ఎన్నికలని ప్రధాని మోడీ పునరుద్ఘటించారు.

ముందుగా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. 2019లో తాను ఇదే గ్రౌండ్‌కు వచ్చానని.. ఆ సమయంలో గ్రౌండ్ మధ్యలో మమతా బెనర్జీ నిర్మాణం చేపట్టాలనుకున్నారని.. మమత చేసిన పనికి ప్రజలు కచ్చితంగా సమాధానం ఇస్తారని చెప్పానని గుర్తుచేశారు. కానీ ఈ రోజు అలా చేయలేదన్నారు. మిమ్మల్ని అందరిని కలిసే అవకాశం లభించిందని మోడీ చెప్పుకొచ్చారు. ఎలాంటి అడ్డంకులు సృష్టించనందుకు బెంగాల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ప్రధాని మోడీ సెటైర్లు వేశారు.

గత పదేళ్ల బీజేపీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. చిత్తశుద్ధితో చేయడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. మరోసారి వికసిత భారత్ కోసం బీజేపీని గెలిపించాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకోగల బలమైన నాయకుడు మోడీ అని ప్రపంచం నమ్ముతోందన్నారు. దేశాన్ని అవినీతి, ఉగ్రవాదం లేకుండా చేసేందుకు మోడీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని కూచ్ బెహార్ ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.

సందేశ్‌ఖాలీలో ఇటీవల జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. నిందితులను రక్షించడానికి పాలక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలను అరికట్టగల సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. సందేశ్‌ఖలీ దోషులకు శిక్ష పడేలా కృషి చేస్తామని.. ఇందుకు బీజేపీ హామీ ఇస్తుందని ప్రధాని అన్నారు. కేంద్ర పథకాలను మమతా బెనర్జీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. దేశంలోని ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, అయితే రాష్ట్రంలోని అధికార పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ఆ పని చేయనివ్వడం లేదన్నారు.

 

Exit mobile version