NTV Telugu Site icon

Kuwait Fire: కేరళ చేరిన 45 మంది కార్మికుల మృతదేహాలు

Kuwit

Kuwit

కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళకు చేరుకున్నాయి. బుధవారం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. ఇక 33 మంది ఆస్పత్రి పాలయ్యారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఒకే కంపెనీకి చెందిన 176 మంది కార్మికులను అద్దె భవనంలో ఉంచారు. అయితే తెల్లవారుజామున వంటగదిలోంచి మంటలు రావడం.. అనంతరం అప్రమత్తమైన కార్మికులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు, పొగ వ్యాపించడంతో ఊపిరాడక.. మెట్లపైనే సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా హుటాహుటినా కేంద్ర విదేశాంగ సహాయమంత్రిని కువైట్‌కు పంపించారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: కీలక శాఖలన్నీ పవన్‌ కల్యాణ్‌కే.. డిప్యూటీ సీఎం సహా నాలుగు శాఖలు..

45 మంది భారతీయ కార్మికుల మృతదేహాలను ఈ ఉదయం భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో దిగింది. మూడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 31 మంది కార్మికుల మృతదేహాలను అప్పగించింది. అనంతరం మిగిలిన 14 మృతదేహాలతో ఢిల్లీకి బయలుదేరింది. బాధితుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కార్మికులతో సహా కొచ్చిలో అప్పగించిన మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి ఇళ్లకు పంపించారు.

ప్రధాని మోడీ సూచనల మేరకు రెండ్రోజుల్లోనే మృతదేహాలు కువైట్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. విదేశాంగ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. కువైట్ వెళ్లి అధికారులతో సంప్రదింపులు జరపడంతో వేగంగా పనులు పూర్తి చేసుకుని మృతదేహాలను భారత్‌కు తీసుకురాగలిగారు. లేదంటే కనీసం 10 రోజులైన పెట్టే అవకాశం ఉంటుంది.

కువైట్ అధికారులకు కీర్తి వర్ధన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పేపర్లు పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని చెప్పారు. అందుకే త్వరగా మృతదేహాలను తీసుకురాగలిగామని.. లేదంటే కనీసం 10 రోజులైన పట్టేదని చెప్పారు. మోడీ సూచనల మేరకు అధికారులు త్వరగా పనులు పూర్తి చేశారని కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. ఇక క్షతగాత్రులు కూడా త్వరగా కోలుకుని రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తన పర్యటనలో ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్-యూసుఫ్ అల్-సబాను కలిశానని.. మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించడంలో పూర్తి మద్దతు, సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ విమానాశ్రయానికి వచ్చి భౌతికకాయాలకు నివాళులర్పించారు.

మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, బాధితుల గుర్తింపును నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. అధికారులు 48 మృతదేహాలను గుర్తించారు. వారిలో 45 మంది భారతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నట్లు తెలిపారు.