NTV Telugu Site icon

IPL 2025 Auction: విరాట్ కెప్టెన్ అయితే.. అతడి కోసం కచ్చితంగా ట్రై చేస్తాడు!

Virat Kohli Rcb

Virat Kohli Rcb

నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జడ్డాలో జరగనుంది. వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)ని టాప్ రిటెన్షన్‌గా తీసుకోగా.. బ్యాటర్ రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), పేసర్ యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. రూ.83 కోట్ల పర్స్ మనీతో మంచి ఆటగాళ్లను కొనేందుకు ఆర్‌సీబీ సిద్దమైంది.

ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరలా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బెంగళూరు వేలంపై స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్’లో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరిస్తే.. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తాడని తెలిపాడు. ‘చహల్‌ను దక్కించుకోవడం ఆర్‌సీబీకి చాలా కష్టమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆర్ అశ్విన్, చహల్ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నం చేస్తుంది. విరాట్ కెప్టెన్ అయితే పాత ట్రంప్ కార్డు చహల్‌ను తిరిగి జట్టులో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లీ వస్తే జట్టులో చాలా మార్పులు జరుగుతాయి’ అని సంజయ్ అన్నాడు.

Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాకు షాక్.. పెర్త్ టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం! కారణం ఐపీఎల్

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చహల్ 15 ఇన్నింగ్స్‌లలో 9.41 ఎకానమీ రేటుతో 18 వికెట్లు తీశాడు. 160 ఐపీఎల్ మ్యాచులలో యూజీ 205 వికెట్స్ పడగొట్టాడు. ఆర్‌సీబీ తరఫున 112 ఇన్నింగ్స్‌లలో 7.58 ఎకానమీ రేటుతో 139 వికెట్స్ తీశాడు. ఈ లెగ్ స్పిన్నర్ ఆర్‌సీబీ తరఫున ఇప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. గతంలో ఎన్నో మ్యాచులలో ఆర్‌సీబీ అద్భుత విజయాలను చహల్ అందించాడు. ఐపీఎల్ 2025 వేలంలో చహల్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. మరి ఏ జట్టు అతడిని సొంతం చేసుకుంటుందో చూడాలి.