ఐపీఎల్ 2025కి ముందు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (10 కోట్లు), అభిషేక్ పోరెల్ (4 కోట్లు)లను డీసీ రిటైన్ చేసుకుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి దృష్టి పంత్‌పైనే ఉంది. అతడికి ధర ఖాయం అని అందరూ అంచనా వేస్తున్నారు. పంజాబ్, బెంగళూరు జట్లు పంత్‌ను తీసుకోవడానికి భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
వేలం నేపథ్యంలో రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తాజాగా విశ్లేషించాడు. రిటెన్షన్ ఫీజు విషయంలో పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీతో విభేదించి ఉండొచ్చని స్టార్‌స్పోర్ట్స్ షోలో సన్నీ అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పంత్ స్పందించాడు. డీసీని వీడటానికి డబ్బుతో ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశాడు. ‘నా రిటెన్షన్ అంశం డబ్బుతో అస్సలు ముడిపడి లేదు. నేను ఈ విషయంను కచ్చితంగా చెప్పగలను’ అని ఆ గవాస్కర్ మాట్లాడిన వీడియోకు కామెంట్ పెట్టాడు.
Also Read: Team India Fans: కోట్లాది గుండెలు బద్దలైన రోజు.. ‘ఒకే ఒక్కడు’ ఎంతపని చేసే!
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘మెగా వేలంలో డీసీ కచ్చితంగా రిషబ్ పంత్‌ను తీసుకుంటుంది. కొన్నిసార్లు ఓ ఆటగాడిని రిటైన్ చేయాలనుకున్నప్పుడు.. ఫీజు గురించి ప్లేయర్, ఫ్రాంఛైజీల మధ్య చర్చ జరుగుతుంది. రిటైన్ అయిన కొంతమందికి ఫ్రాంఛైజీలు మొదటి రిటెన్షన్ కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. వేలంలో పంత్‌ను ఢిల్లీ పక్కాగా దక్కించుకుంటుంది. ఎందుకంటే డీసీకి కెప్టెన్ అవసరం ఉంది. పంత్ జట్టులో లేకుంటే కొత్త కెప్టెన్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. డబ్బు మ్యాటర్ కాదన్న పంత్.. అసలు విషయం మాత్రం చెప్పలేదు.