Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

Pawan Kalyan

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పరిధిలోకి పిఠాపురం స్టేషన్‌ను చేర్చుతూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ. 37.25 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. గతంలో పిఠాపురం పర్యటనకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని అశుభ్రతను గమనించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జనవరిలో ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తో ప్రత్యేకంగా సమావేశమై.. పిఠాపురం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం స్టేషన్‌ను ఆధునీకరించాలని కోరారు.

Also Read:KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?

ఈ నిధులతో పిఠాపురం రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. స్టేషన్ భవనం , ముఖద్వారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం.. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గదుల నిర్మాణం.. అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్ మరియు ప్లాట్‌ఫారాల అభివృద్ధి.. ప్రయాణికుల కోసం అదనపు షెల్టర్ల నిర్మాణం అనేవి దీనిలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.

పిఠాపురం అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో పిఠాపురం ఒక ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక రైల్వే హబ్‌గా మారనుంది.

Exit mobile version