NTV Telugu Site icon

Prabhakar Rao-SIT: 8 గంటలు కొనసాగిన విచారణ.. ప్రభాకర్‌ రావుపై సిట్‌ ప్రశ్నల వర్షం!

Prabhakar Rao Sit

Prabhakar Rao Sit

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. సిట్‌ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్‌ రావుపై డీసీపీ విజయ్‌, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్‌ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారు.

జూన్ 11వ తేదీన వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకొని రావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని కోరారు. రెండు సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన లాప్ టాప్, మ్యాక్ బుక్ తీసుకురావాలని చెప్పారు. 8 గంటల పైగా ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ జరిగిన విచారణలో ప్రణీతరావుతో పాటు ఎస్‌ఐబీ చీఫ్‌గా కార్యకలాపాలపై విచారణ జరిగింది. ఎస్‌ఐబీలోని హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసంతో పాటు డేటా మాయంపై ప్రశ్నలు కురిపించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్‌ రావుకి హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయమని చెప్పిన వారెవరు?, పాత హార్డ్‌ డిస్క్‌లు తీసి కొత్తవి పెట్టమని చెప్పిన వారు ఎవరు? అంటూ విచారణ ప్రశ్నలు కురిపించారు.

Also Read: Bhatti Vikramarka: వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పైబడి గెలుస్తాం!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్‌ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ రావు, భుజంగ రావు, తిరుపతన్నను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్‌ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్లిపోయారు.ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసులు పాస్‌పోర్టు రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్‌ డాక్యుమెంట్‌తో ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.