ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణ ముగిసింది. సిట్ అధికారులు కేటీఆర్‌ను దాదాపుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు. గంట పాటు రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. రాధాకిషన్ రావుకు కేటీఆర్ షేర్ చేసిన నంబర్లపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. గతంలో ఉప ఎన్నికల సమయంలో ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్‌ను ప్రశ్నించారు. విచారణ పూర్తైన అనంతరం కేటీఆర్ సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
విచారణ ముగిసిన వెంటనే కేటీఆర్ సిట్ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సిట్ విచారణపై తన వాదన, ఆరోపణలపై స్పందన, రాజకీయ పరిణామాలపై ఆయన ఏమంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రెస్‌మీట్‌లో కేసుకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశముందని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
