NTV Telugu Site icon

Perni Nani Political Retirement: సీఎంకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. ఇక, రిటైర్ అయిపోతున్నా

Perni Nani

Perni Nani

Perni Nani Political Retirement: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పేర్నినాని.. సభా వేదిక పై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.. వయస్సులో చిన్నవాడు అయిపోయాడు.. లేదంటే సీఎం వైఎస్‌ జగన్‌కు పాదాభివందనం చేసి ఉండేవాడిని అని వ్యాఖ్యానించారు.. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానన్న పేర్నినాని.. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి .. ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని తెలిపారు. అయితే, సీఎం వైఎస్‌ జగన్ తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో..? లేదో? తెలియదు అని వ్యాఖ్యానించారు పేర్నినాని.

ఇక, పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు అడ్డుపడ్డాడు అంటూ మండిపడ్డారు పేర్ని నాని.. ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందని తెలిపారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంఖుస్థాపన చేశాడని విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 450 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.. ఈ ఒక్క నియోజకవర్గంలో 25,090 మందికి పట్టాలు ఇచ్చామని తెలిపరాఉ.. ఒక్క లే అవుట్ లోనే 15 వేల మందికి పట్టాలు ఇస్తామని తెలిపారు.

బందరు పోర్టు నిర్మాణంతో మచిలీపట్నానికి పోటీగా మరో ఊరు ఏర్పడనుందన్నారు పేర్నినాని.. చంద్రబాబు హయాంలో కలెక్టరేట్ గబ్బిలాలతో ఉండేదని.. పాలన అంతా విజయవాడలోనే ఉండేదని.. జిల్లా విభజన చేసి బందర్‌ను హెడ్ క్వార్టర్ చేశారని సీఎంపై ప్రశంసలు కురిపించారు. బందరుకు కళ వచ్చింది.. మెడికల్ కాలేజీ ప్రారంభం అవుతోందన్నారు. అయితే, మెడికల్ కాలేజీ దగ్గర ఆర్వోబీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేయాలని కోరుతున్నాను.. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు పట్టా భూములు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ అంటూ సభా వేదిక నుంచి సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే, పేర్ని నాని, పొలిటికల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడం ఇప్పుడు చర్చగా మారింది. నాని ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌చేయండి..