Penugonda Farmers: తుఫాన్‌ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!

Penugonda Farmers Protest

Penugonda Farmers Protest

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో రైతులు ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డ్ కారణంగా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పెనుగొండ ప్యాలెస్ రోడ్ సెంటర్‌లో నిరసన చేపట్టడంతో.. పెనుగొండ–నిడదవోలు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డంపింగ్ యార్డ్ వల్లే తమ పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నక్కల కాలువలో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని ఆరోపించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో ముంపునీరు పొలాల్లోకి చేరిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్‌ల ప్రభావంతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని.. తాజాగా ముంపు కారణంగా మరింత నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగొండ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. నక్కల కాలువలో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించి.. నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఆందోళన విరమించి రహదారిపై నుంచి వెళ్లిపోవాలని పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.