NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: ఇది పెమ్మసాని హామీ.. వచ్చే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు..

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు రాబోయే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదని.. ఇది పెమ్మసాని హామీ అని భరోసా ఇచ్చారు గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. సాధారణంగా పదేళ్లలో రావాల్సిన వ్యతిరేకతను రజనీ మూడేళ్లలోనే మూట కట్టుకున్నారని ఆయన అన్నారు. అందుకే నియోజకవర్గం నుంచి పారిపోయి గుంటూరుకు చేరారని విమర్శించారు. నగరంలోని పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో గల 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవితో కలిసి పెమ్మసాని మంగళవారం పర్యటించారు. స్థానిక నేతాజీ నగర్, ఉద్యోగ నగర్, క్రాంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలు స్పందిస్తూ నిత్యం తాగునీరు అందడం లేదని, పారుదలలేని డ్రైనేజీ, మురుగుతో నిండిపోయిన సైడ్ కాలువల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నామని పెమ్మసాని ముందు వాపోయారు. ప్రజా సమస్యలను పూర్తిగా విన్న తర్వాత ఆయన స్పందిస్తూ.. 2014-19 మధ్యన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందిన నిధుల ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలయ్యాయని, అయితే మధ్యలో అవినీతి అధికారుల, నాయకుల కారణంగా ఆ పనులు అటకెక్కాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులను కొందరి అకౌంట్లకు మళ్ళించే ప్రయత్నాలు జరిగాయని, ఎన్నికల తర్వాత పూర్తి వివరాలు బయట పెడతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

గుంటూరులో ప్రస్తుతం పేరుకుపోయిన నీటి సమస్యల పరిష్కారార్థం కొత్తగా నిధులు తేవాల్సిన పనిలేదని, అందుబాటులో ఉన్న సాంకేతికతను, సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలిగితే చాలు అన్నారు. రాబోయే 8-10 నెలల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించే అవకాశం ఉందని, ఇది పెమ్మసాని హామీగా చెప్తున్నాను అని ఆయన తెలిపారు. కేబుల్ టీవీ, గ్రానైట్, రేషన్, అక్రమ కట్టడాలు, మున్సిపల్ షాపు కాంప్లెక్స్ లు ఇలా కనపడ్డ ప్రతి రంగం నుంచి నెల నెలా లక్షలకు లక్షలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఫ్లెక్సీలు, వేయించి రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆ నాయకురాలు(విడదల రజినీ) ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలను తీసుకువచ్చి, ఉద్యోగావకాశాలను కల్పించాలంటే.. ఆయా అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఓటు వన్ సైడ్‌గా వేయాలని కోరుతున్నామన్నారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, 42వ డివిజన్ కార్పొరేటర్ వేములపల్లి శ్రీనివాసరావు(బుజ్జి), 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రుస్తుంబాబు అలాగే స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.