NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: ఖురాన్ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్ గా ప్రవక్త ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక పొన్నూరు రోడ్‌లోని బీ కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన గుంటూరు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఇఫ్తార్ ధావత్ కార్యక్రమానికి ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి రోజా విరమణ, నమాజ్, ధువా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ.. పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో ఖురాన్ గురించి తాను మూడు విషయాలు తెలుసుకున్నానన్నారు. అవి ఓర్పు – సహనం, దానగుణం, కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయడం అని వివరించారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను మైనారిటీలకు చంద్రబాబు నాయుడు అందించారని, టీడీపీ నాయకత్వంలో ముస్లింలకు భద్రత ఉందని తెలిపారు. దుల్హన్, రంజాన్ తోఫా వంటి అనేక కార్యక్రమాలతో ముస్లింలకు అండగా నిలబడిన టిడిపిని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అంతకు ముందు కాపు సామాజిక వర్గం నేతలతో పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. టీడీపీ నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.