NTV Telugu Site icon

PDS Ration Scam: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు!

Perni Nani

Perni Nani

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.

గత రెండు నెలలుగా రేషన్‌ బియ్యం అక్రమాల వ్యవహారం ఏపీ రాష్ట్రమంతా మారుమోగుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో రేషన్‌ మాఫియా వేళ్లూనుకుందని.. కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలిచ్చారు. దాంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి.. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు పేర్ని నాని లేఖ రాశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది.

రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందించారు. రేషన్ బియ్యం తగ్గుదలపై మరోసారి అధికారులు గోదాములలో విచారణ చేయనున్నారు. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని పిటీషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని నాని తన సతీమణిని అజ్ఞాతంలోనే ఉంచారు.

 

 

 

Show comments