Site icon NTV Telugu

Asia Cup 2025 Trophy: ఆసియా కప్‌ ట్రోఫీతో పీసీబీ చీఫ్ పరార్.. సిగ్గులేదంటూ ఫాన్స్ ఫైర్!

Mohsin Naqvi Trophy

Mohsin Naqvi Trophy

టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్‌ 2025 ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. కుల్దీప్ యాదవ్ (4/30), అక్షర్‌ పటేల్‌ (2/26), వరుణ్‌ చక్రవర్తి (2/30) మాయ చేయడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఛేదనలో భారత్ తడబడినా తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ (69 నాటౌట్‌; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడడంతో భారత్ టైటిల్ గెలిచింది. లీగ్ దశ, సూపర్-4 మాత్రమే కాకుండా.. ఫైనల్లోనూ పాకిస్తాన్‌కు భారత్ చేతిలో పరాజయం తప్పలేదు.

ఫైనల్ మ్యాచ్ ముగిసాక మైదానంలో హైడ్రామా చోటుచేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ఆసియా కప్‌ 2025 ట్రోఫీని తీసుకునేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. టీమిండియా ప్లేయర్స్ అందరూ మైదానంలో పడుకుని.. తమ ఫోన్స్ చూసుకున్నారు. టీమిండియా ప్లేయర్స్ కోసం వేదికపై పీసీబీ అధ్యక్షుడు, ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ సహా యూఏఈ పెద్దలు కూడా పడిగాపులు కాశారు. అయినా కూడా ట్రోఫీ తీసుకునేందుకు మనోళ్లు ముందుకురాలేదు. ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ముందుకు రాకపోవడంతో నఖ్వీ అసహనం వ్యక్తం చేశాడు.

పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం అనంతరం కోపంతో ఊగిపోయిన పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ.. ట్రోఫీని తనతో పాటు హోటల్‌కు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు. నఖ్వీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. ఈ ట్రోఫీని హోటల్‌కు తీసుకెళ్లినందుకు బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నఖ్వీ ట్రోఫీని తీసుకెళ్తున్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ట్రోఫీతో పీసీబీ చీఫ్ పరార్’, ‘మోహ్సిన్ నఖ్వీకి సిగ్గులేదు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version