NTV Telugu Site icon

Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్‌ కోహ్లీ స్లెడ్జింగ్‌!

Musheer Khan Kohli

Musheer Khan Kohli

విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. సహచరులు అయినా, ప్రత్యర్ధులు అయినా.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఒక్కోసారి దురుసుగా కూడా ఉంటాడు. కీలక మ్యాచ్‌లలో అయితే స్లెడ్జింగ్‌ చేస్తూ హద్దులు దాటుతుంటాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా ముల్లాన్‌పూర్‌ వేదికగా గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్ విరాట్.. యువ ఆటగాడిపై విరాట్‌ స్లెడ్జింగ్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ముషీర్‌ ఖాన్‌ మైదానంలోని తమ జట్టు ఆటగాళ్లకు వాటర్ బాటిల్స్ అందించాడు. పంజాబ్‌ మిడిల్‌ ఆర్డర్‌ విఫలమవడంతో ముషీర్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడికి ఇదే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. ముషీర్‌ క్రీజులోకి వచ్చిన సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్ కోహ్లీ.. యువ ఆటగాడిపై స్లెడ్జింగ్‌ చేశాడు. ‘యేతో పానీ పిలాతా హై’ (ఇతగాడు ఆటగాళ్లకు నీళ్లు అందిస్తాడు) అంటూ ఎద్దేవా చేశాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ కోహ్లీని ఆడేసుకుంటుంన్నారు. స్టార్‌ బ్యాటరై ఉండి యువ ఆటగాడిని అలా అనడం కోహ్లీకి సరికాదు, కోహ్లీ స్థాయికి ఇది తగదు, యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి స్లెడ్జింగ్‌ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముషీర్‌ ఖాన్‌ విఫలమయ్యాడు. 33 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ సుయాష్ శర్మ అతడిని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడే ముషీర్‌ ఖాన్‌ అన్న విషయం తెలిసిందే. దేశవాళీల్లో సత్తాచాటిన ముషీర్‌ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2025 మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 8.2 ఓవర్లలో 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి సమయంలో ముషీర్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. యువ ఆటగాడి మనసును మళ్లించే ప్రయత్నంలో భాగంగానే విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌ చేసి ఉంటాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.