NTV Telugu Site icon

Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు

Payyavula Keshav

Payyavula Keshav

Minister Payyavula Keshav: రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. కీలకాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవను జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో ప్రభుత్వం మారాక జాతీయ స్థాయిలో పాజిటివ్ టాక్ వినిపిస్తోందని పయ్యావులకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు చెప్పారు. పయ్యావుల కేశవ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రి వర్గ ఉప సంఘం వేసింది. తాను చేసిన సూచనలపై వెంటనే మంత్రి వర్గ ఉప సంఘం వేసినందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక మంత్రి పయ్యావుల ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Teacher Kidnap: క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌..

5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణాపై ఒక్క శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూచించారు. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ సెస్ ద్వారా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించారన్నారు. ఇన్నోవేషన్లకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని సూచించారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలి.. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చిన్న వ్యాపారస్తులు.. కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచనలు చేశారు. అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.