ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫెస్ (యూపీఐ) సేవల సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసేందుకు గానూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) భాగస్వామ్యంతో యూపీఐ లైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి బ్యాంక్ తమదేనని పేటీఎం బ్యాంక్ వెల్లడించింది. దీని ద్వారా చిన్న లావాదేవీలను ఒక్క క్లిక్‌తో పూర్తి చేయవచ్చని చెప్పింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా తీసుకొచ్చిన ఈ యూపీఐ లైట్ వాలెట్‌లో చిన్న మొత్తాల చెల్లింపులు చేయొచ్చు. ఒక్కసారి గరిష్టంగా రూ.200 వరకు ఇన్‌స్టాంట్‌గా పంపిచొచ్చు. గరిష్ఠంగా రూ.2,000 వరకు యాడ్ చేసుకోవచ్చు. రోజులో రెండు సార్లు మాత్రమే యాడ్ చేసుకునే వీలుంటుంది. అంటే రోజులో గరిష్ఠంగా రూ.4000 వరకు పేమెంట్స్ చేయవచ్చని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది.
“పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యూపీఐ లైట్‌ను లాంఛ్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు వేగంగా, సురక్షితంగా, నిరంతరాయంగా చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. రూ.200 లోపు ఉండే లావాదేవీలను వారి కోర్ బ్యాంక్‌తో సంబంధం లేకుండా 50 శాతం వరకు ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. ఇది లావాదేవీల సక్సెస్ రేటును పెంచుతుంది. యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా రోజుకు బిలియన్ ట్రాన్సాక్షన్ల ప్రక్రియను మరింత పెంచుతుంది. యూపీఐ లైట్ లావాదేవీలు కేవలం పేమెంట్ బ్యాలెన్స్ హిస్టరీ సెక్షన్‌లో మాత్రం కనిపిస్తాయి, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌లో కనిపించవు” అని ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణ్ రాయ్ అన్నారు.
Also Read: Guntakal Mystery Cases: ఉలిక్కిపడ్డ గుంతకల్లు.. ఆ దారుణాలకు కారణమేంటి?