Site icon NTV Telugu

Sunetra Pawar: పవార్ కుటుంబంలో ‘పవర్’ పాలిటిక్స్.. ఎన్సీపీ చీఫ్‌గా అజిత్ సతీమణి!

Ajit Pawar

Ajit Pawar

Sunetra Pawar: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన తరువాత, మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతోంది. NCP లో అజిత్ పవార్ శకం ముగిసిన తర్వాత పార్టీ గణనీయమైన మార్పులకు లోనవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

READ ALSO: EPFO: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మందికి షాక్..!

కానీ పార్టీ స్థాయిలో ఇంకా మార్పులు చేయాల్సి ఉంది. ఎన్సీపీలో నాయకత్వ మార్పు ఆసన్నమైందని, సునేత్రా పవార్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్‌ను నియమించాలని చాలా మంది పార్టీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అజిత్ పవార్ మరణం తరువాత, మహారాష్ట్ర రాజకీయాలు గణనీయమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సునేత్రా పవార్ చేతుల్లో వెళ్తుందని సమాచారం. ఇప్పటివరకు పార్టీ పగ్గాలు అజిత్ పవార్ నిర్వహించేవారు. లోక్‌సభ ఎన్నికలు అయినా, జిల్లా స్థాయి ఎన్నికలు అయినా, టికెట్ల పంపిణీ నుంచి ప్రచార వ్యూహం వరకు ప్రతిదానికీ అజిత్ పవార్ బాధ్యత వహించారు. అయితే ఆయన ఆకస్మిక మరణం తరువాత, పార్టీలో అజిత్ పవార్ పేరు ప్రముఖంగా ఉండేలా చూసేందుకు పార్టీ నాయకులు ఈ బాధ్యతను సునేత్రా పవార్‌కు అప్పగించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ త్వరలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది.

సునేత్రా చుట్టూ NCP రాజకీయం..
రాబోయే కాలంలో NCP రాజకీయ శక్తి అంతా సునేత్రా పవార్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం నుంచి ప్రభుత్వ బాధ్యతల వరకు ప్రతి స్థాయిలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. అజిత్ పవార్ మరణం తరువాత ఎన్సీపీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను పూడ్చడానికి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోపార్టీలో నాయకత్వ మార్పు కోసం కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. సునేత్రా పవార్‌ను జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని అధికారికంగా డిమాండ్ చేస్తూ 30 ప్రధాన ఎన్‌సిపి సెల్‌ల అధ్యక్షులు, తాత్కాలిక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు ఒక లేఖను కూడా రాశారు. ఈ అంశంపై చర్చించడానికి త్వరలో NCP జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు కానుంది, ఈ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పుకు అధికారికంగా ఆమోదం లభించే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే NCP చరిత్రలో ఇది ఒక ప్రధానమైన, నిర్ణయాత్మక మలుపుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Exit mobile version