NTV Telugu Site icon

Pawan Kalyan: పిఠాపురానికి పవన్‌ కల్యాణ్‌.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ ఓవైపు.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచి ముందుకు సాగుతుండగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో జనసేనాని పర్యటన కొనసాగనుంది.. తన పోటీపై ప్రకటన చేసిన తర్వాత తొలిసారి పవన్‌ పిఠాపురం వస్తుండడంతో.. ఆసక్తికరంగా మారింది.

Read Also: Virat Kohli- Gambhir: వీరికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు: సునీల్ గవాస్కర్

నేడు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గొల్లప్రోలుకు చేరుకుంటారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తొలిరోజు శక్తిపీఠం పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అనంతరం దత్త పీఠాన్ని దర్శించుకుంటారు.. ఆ తర్వాత దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి.. ఆయనతో సమావేశం కానున్నారు.. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పొలిటికల్‌ హీట్‌ పెరిగినట్టు అయ్యింది.. ఈ పర్యటనలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు, నియోజకవర్గానికి చెందిన పలు వర్గాలతో మీటింగ్‌లు ప్లాన్‌ చేసింది జనసేన.. ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పిఠాపురంలో .. ఏప్రిల్ 3న తెనాలిలో, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్.. 9వ తేదీన పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.. 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరంలో పవన్‌ కల్యాణ్ ప్రచారం చేస్తారని జనసేన ప్రకటించింది.