NTV Telugu Site icon

Pawan Kalyan: గద్దర్‌ పార్థివదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్‌ పార్థివ దేహానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నివాళులర్పించారు. అనంతరం పవన్‌ కళ్యాణ్ గద్దర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు. గద్దర్‌ పార్థివ దేహాన్ని చూసిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ తట్టుకోలేకపోయారు. గద్దర్ కుమారుడు సూర్యకిరణ్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్దర్‌తో పవన్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని పవన్‌కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

Also Read: CM KCR: అధికారిక లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు

గద్దర్ మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజా యోధుడు గద్దర్ అంటూ కొనియాడారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణించారంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. “అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా.. అంటూ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించీ, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారు. ‘మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి…’ అనే చైతన్య గీతం అజరామరం. నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది. తాడిత పీడిత అణగారిన వర్గాలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పోరుసల్పిన గద్దర్ తుది శ్వాస వరకూ అదే బాటలో పయనించారు.గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి… కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది.” అని పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

Also Read: Gaddar Passes Away LIVE UPDATES: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

“గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం, ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఒగ్గు కథ, ఎల్లమ్మ కథ, బుర్ర కథల రూపంలో సామాజిక సమస్యలపై చైతన్యపరచిన విధానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ‘నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ… తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ…’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది.. అనిర్వచనీయమైనది. విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో… భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన గద్దర్ పీడిత వర్గాల కోసం ఆయనపడిన తపన, చేసిన పోరాటమే ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేశాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది. గద్దర్ మరణం ఆయన కుటుంబానికే కాదు… తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గద్దర్ కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గద్దర్‌ను చివరిసారిగా కలిసినప్పుడు ‘నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి.” అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

Show comments