Gaddar Passes Away LIVE UPDATES: దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ ప్రాణాలు కోల్పోయారు. ఇక గద్దర్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహాన్ని ఉంచారు.
గద్దర్ మరణం పట్ల కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. " నేను ఎంతో అభిమానించే ప్రజా గాయకుడు, విప్లవ కవి, నిరుపేద ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న గద్దరన్న మరణం పట్ల తీవ్ర సంతాపం, సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు తెలియ జేస్తున్నాను. కోట్లాది మంది నిరుపేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాలని నిరంతరం పరితపించిన గద్దరన్న మరణం యావత్తు రాష్ట్రానికి, యావత్తు దేశానికి తీరని లోటు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో కృషి చేసిన గద్దరన్నను తెలంగాణ వాదులు ఏనాడు మర్చిపోరు. జోహార్ గద్దరన్న." -ఉత్తమ్ కుమార్ రెడ్డి
అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంతాపం తెలిపారు. "గద్దర్ దశాబ్దాల కాలం పాటు పేద ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు నడిపారు. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు. వారం రోజుల కింద గద్దర్‌ను ఆసుపత్రికి వెళ్లి కలిసి మాట్లాడాను. తన ఆలోచనలు అభిప్రాయాలు చాలా చెప్పారు.. ఇంతలోనే ఇలా అవుతుందని అనుకోలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.." -జానారెడ్డి
ప్రజా గాయకులు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా సమస్యలపై జరిగే పోరులో ప్రత పాల్గొనడంతో పాటు, తనదైన శైలిలో పాటలు రచించి, పాడి గద్దర్ జన చైతన్యం కలిగించేవారన్నారు. తెలుగు సాంస్కృతిక రంగంలో గద్దర్ కీలకపాత్ర పోషించారన్నారు. గద్దర్ మరణంపట్ల సీపీఐ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నామన్నారు.
గద్దర్ మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజా యోధుడు గద్దర్ అంటూ కొనియాడారు. "ప్రజా గాయకుడు గద్దర్ మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా.. అంటూ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించీ, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారు. ‘మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి...’ అనే చైతన్య గీతం అజరామరం. నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది. తాడిత పీడిత అణగారిన వర్గాలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పోరుసల్పిన గద్దర్ తుది శ్వాస వరకూ అదే బాటలో పయనించారు.గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి... కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది.
గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం, ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఒగ్గు కథ, ఎల్లమ్మ కథ, బుర్ర కథల రూపంలో సామాజిక సమస్యలపై చైతన్యపరచిన విధానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ‘నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ...’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది.. అనిర్వచనీయమైనది. విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో... భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన గద్దర్ పీడిత వర్గాల కోసం ఆయనపడిన తపన, చేసిన పోరాటమే ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేశాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది. గద్దర్ మరణం ఆయన కుటుంబానికే కాదు... తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గద్దర్ కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గద్దర్‌ను చివరిసారిగా కలిసినప్పుడు ‘నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి." -పవన్ కళ్యాణ్
"తెలంగాణ ప్రజాకవి, ప్రజా యుద్ధనౌక గద్దరణ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి." -రాహుల్ గాంధీ
Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist.
His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "మెతుకు సీమ ముద్దు బిడ్డ నేలకొరిగారు. నమ్మిన సిద్దాంతం కోసం నాలుగు దశాబ్దాలు పోరాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాయి." -రఘునందన్ రావు
గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను సభ స్మరించుకుంది.
ప్రజాగాయకుడు గద్దర్ మృతిపట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం తెలిపారు. ప్రజా యుద్ధనౌక మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఆయన మాటలు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చాయన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆమె ప్రార్థించారు.
A profound loss for Telangana as we bid farewell to Shri Gaddar , the legendary poet and activist. His words kindled the spirit of our people, and his advocacy for social justice will be remembered fondly. May his soul rest in peace pic.twitter.com/6coqOAnIbs
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 6, 2023
"ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్తిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటాయి. గద్దర్ కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." - జూ.ఎన్టీఆర్
ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన
ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది.గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/oksRc840PC
— Jr NTR (@tarak9999) August 6, 2023
ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్లు అయ్యిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
“ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్.
తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో... పౌరహక్కుల పోరాటాల్లో...ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి… pic.twitter.com/pe1PIMdYLQ
— N Chandrababu Naidu (@ncbn) August 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్ ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. తన పాటలతో ప్రజలను చైతన్య పరిచారన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతిపట్ల హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని మంత్రి హరీశ్ కీర్తించారు. తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచిన గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు.
రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర కొనసాగనుంది. మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గద్దర్ స్థాపించిన స్కూల్ మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ భార్య విమల సూచించారు.
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు. "సామాజిక సమస్యల పట్ల ఆయన చూపిన అచంచలమైన అంకితభావం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం. గద్దర్ పాటలు లక్షలాది మంది ఆకాంక్షలను ప్రతిధ్వనించాయి, మన హృదయాలపై చెరగని ముద్ర వేసాయి. ఆయన చైతన్య జ్వాలలను రగిలిస్తూనే ఉండనివ్వండి." -ప్రియాంకగాంధీ వాద్రా
Saddened to hear about the passing of Shri Gummadi Vittal Rao garu, the iconic poet and relentless activist.
His unwavering dedication to social causes and the fight for Telangana's statehood was truly inspiring. Gaddar ji's powerful verses echoed the aspirations of millions,… pic.twitter.com/Zaq7Ev7zv6
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గద్దర్ మృతి బాధాకరమని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ నిలిచారన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం. ఉద్యమ గళం మూగబోయింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి. - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
గద్దర్ మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని ఆమె ఆవేదన్ వ్యక్తం చేశారు. " గద్దరన్న మృతి వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఉద్యమ నాయుకులు ఎక్కడి నుంచి వచ్చినా వారు ఏ పార్టీలో ఉన్నా ఆ భావం ఉంటుంది. ప్రజా సమస్యల పోరాడిన వ్యక్తి ఇలా కన్నుమూయడం చాలా బాధాకరం. గద్దరన్న భార్య కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు ఇప్పుడు మనమందరం బాసటగా ఉండాలి." -సీతక్క
గద్దర్ మృతిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. "గద్దర్ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గద్దర్ తన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. గద్దర్ మరణం తీరని లోటు. గద్దర్ లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ప్రజల్లో జానపదం ఉన్నంత కాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది." -కేటీఆర్
"ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాయుద్ద నౌకగా ప్రసిద్ధి చెందిన గద్దర్ మృతి అత్యంత బాధాకరం. ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి ఎప్పటికి తీరని లోటు. గద్దర్ తన జీవితాంతం తెలంగాణ కొరకు తపన పడ్డారు. తొలిరోజుల్లో ఇక్కడి సమాజంలో వ్రేళ్లూనుకొని పోయిన ఫ్యూడల్ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసారు. తన పాట, ఆటలతో ప్రజలను చైతన్య పర్చారు. మ్యుఖంగా బడుగు బలహీన వర్గాలను జాగృతం చేసారు. వారిలో పోరాట స్ఫూర్తిని రగిల్చారు. తమ హక్కులను కాపాడుకోవడానికీ వర్గ శత్రువులపై తిరుగుబాటు చేయమన్నారు. తెలంగాణ సాధనలో గద్దర్ పాత్ర అసమానం. ఆయన ప్రభావం తెలంగాణ యువతపై అపారం. వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితులు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో నాకు తన నైతిక మద్దతు తెలిపారు. గద్దర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ చేస్తున్నాను." - తూళ్ల దేవేందర్ గౌడ్, మాజీ రాజ్య సభ సభ్యులు
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఇది అత్యంత విషాదభరితమైన వార్త. ప్రజాపోరాటాల మహాశిఖరం ఒరిగిపోయింది. మానవత్వం, త్యాగనిరతి, మహోన్నతమైన వ్యక్తిత్వం, ప్రజల గొంతు మూగపోయింది. గద్దరన్న ఇక లేడన్న వార్త కలిచివేసేదిగా ఉంది. యావత్ జీవితం ప్రజలకొరకు చేసే పోరాటాలకు అంకితం చేసిన మీ బాట, మీ పాట భావితరాలకు చుక్కానిగా, బడుగు దీనజనుల గుండెల్లో ఆశాదీపంగా అజరామరంగా నిలుస్తుంది. సలసల మండే గుండెమంటల రాగంతో వలవల జారే కన్నీళ్ళ తాళంతో పాడిన ప్రతి గేయం అమరం. ఓ పోరాటయోధుడా అందుకో సలాం.. -వైఎస్ షర్మిల
ప్రజా గాయకుడు , తన పాటలతో యావత్ ప్రజానీకం గుండెల్లో చోటు సంపాదించుకున్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచిన డీకే అరుణ, వారి కుటుంబ సబ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని కోరుతున్నట్లు డీకే అరుణ ఓ ప్రకటనలో వెల్లడించారు.
"ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్. కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించింది. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, వారు మనోధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను." -సీహెచ్ విద్యాసాగర్ రావు
గద్దర్ మృతిపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. "ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ గారు.. కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో.. సరికొత్త ఊపును తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ గారి పాట ఓ సంచలనం. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో నేను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ నాతో కలిసి నడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." -కిషన్ రెడ్డి