Pawan Kalyan: కేరళలో జరిగిన బోటు ప్రమాదం విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట్ బోల్తా పడ్డ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరమన్న ఆయన.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం.. ఈ ప్రమాదాన్ని ప్రతి రాష్ట్ర పర్యాటక శాఖ ఒక పాఠంగా తీసుకోవాలన్నారు.. ఇక, పాపికొండలు పర్యాటక బోటు ప్రమాద ఘటనను ఎవరం మరచిపోలేమన్నారు.. ప్రధానంగా జల విహారానికి సంబంధించిన ప్రాంతాల్లో నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సూచించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
కాగా, కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాద దుర్ఘటనలో 22 మంది మృతిచెందారు.. వీరిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు.. తనూర్ ప్రాంతంలోని తువల్‌తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ హౌస్‌బోట్ బోల్తాపడిన విషయం తెలిసిందే. టికెట్ల పరంగా చూసుకుంటే.. ప్రమాద సమయంలో 30 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మంది టికెట్ లేకుండానే పడవ ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మొత్తం ఎంతమంది ప్రమాదం బారిన పడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన విషయం విదితమే.