Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ప్రమాదం అరుదైన ఘటన.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!

  • 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు
  • ప్రమాదంపై త్రీమెన్ కమిటీ విచారణ చేస్తుంది
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని మా ఆకాంక్ష
Pawan Kalyan Steel Plant

Pawan Kalyan Steel Plant

Pawan Kalyan on Visakha Steel Plant Accident: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం బాధితులను పరామర్శించారు. విశాఖలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను కలిసి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన పవన్.. ప్రమాదంపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, ఇది అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు.

ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే బొకారో స్టీల్ ప్లాంట్‌కు చెందిన నిపుణులతో కూడిన త్రీ-మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీస్తుందని చెప్పారు. ప్రమాదానికి ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినట్లు సమాచారం ఉందని, ఆ అంశాన్ని కూడా విచారణలో భాగంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పవన్ వెల్లడించారు. తానే స్వయంగా ఆ సమావేశాన్ని నిర్వహించి ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలపై సమగ్ర చర్చ జరిపి పరిష్కార మార్గాలు అన్వేషిస్తానన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను త్వరలో కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని తెలిపారు.

×
×
Ad

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకర అంశమని పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏదో ఒక పారిశ్రామిక ప్రమాదం జరుగుతోందని, కంపెనీల నిర్వహణ విధానం, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణపై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్‌లో సేఫ్టీ ఆడిట్ ఎలా నిర్వహించారనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం ఆధునికీకరణ (అప్‌గ్రేడేషన్) తప్పనిసరి అని పవన్ అభిప్రాయపడ్డారు. కాప్టివ్ మైన్స్, సాంకేతిక అప్‌గ్రేడేషన్, ఆర్థిక సమస్యలు సహా అన్ని అంశాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాంట్‌లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే తమ ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం గతంలో తాము పోరాటం చేశామని గుర్తుచేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఇప్పటికే ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా, ఇతర సహాయ చర్యలు పూర్తిగా అమలు అవుతాయని భరోసా ఇచ్చారు. ఈ ఘటనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, నిర్వహణ లోపాలు, కార్మికుల సంక్షేమంపై మరోసారి చర్చ మొదలైంది. త్రీ-మెన్ కమిటీ నివేదిక తర్వాత ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.