Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!

  • 21 సీట్లతో రాజీపడలేదు, ఏపీ కోసం త్యాగం చేశాం
  • మాకు ప్రజలు 100 శాతం విజయాన్ని ఇచ్చారు
  • సమిష్టి కృషితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాం
Pawan Kalyan Comments

Pawan Kalyan Comments

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏర్పాటులో జనసేన 21 సీట్లతో రాజీపడలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసిందని స్పష్టం చేశారు. ప్రజలు తమ త్యాగాన్ని గుర్తించి 100 శాతం విజయాన్ని అందించారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తోందని పవన్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో అందరి సహకారం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జనసేనాని చెప్పుకొచ్చారు.

వ్యవస్థలు బలహీనపడినప్పుడు కులం, ప్రాంతీయత వంటి అంశాలు ముందుకు వస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రం కుల రాజకీయాలను అధిగమించాలని, మరో రాష్ట్రం ప్రాంతీయత భావనను దాటాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సంస్థల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ‘ప్రజలు పార్టీలను మాత్రమే కాకుండా వ్యవస్థలను కూడా నమ్మాలి. నాయకులను కాకుండా సంస్థలను విశ్వసించాలి. వ్యక్తులను కాకుండా విలువలను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం, గ్రామ స్వరాజ్యం సాకారం అవుతాయి’ అని పవన్ అన్నారు.

×
×
Ad

రాష్ట్రంలో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. గత రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించే ప్రయత్నం చేశామని వివరించారు. గ్రామస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచేందుకు కృషి చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల పరిస్థితి దయనీయంగా ఉండేదని విమర్శించారు. కనీస అవసరాలకు కూడా నిధులు లేని పరిస్థితులు ఉండేవని, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేశానని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేసిన పవన్.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.