Site icon NTV Telugu

Pawan Kalyan: మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు..? ఎన్ని సీట్లల్లో.. ఎక్కడ పోటీ చేస్తామో వైసీపీకి ఎందుకు?

Pk

Pk

Pawan Kalyan: టీడీపీ-జనసేన పొత్తులపై విమర్శలు గుప్పిస్తున్న అధికార వైసీపీ నేతలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎందుకు..? ఇక్కడ మేం ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామో.. ఎక్కడ పోటీ చేస్తామోననేది వైసీపీకి ఎందుకు..? అని నిలదీశారు. జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్లాలనేది నా ఆకాంక్షగా తెలిపారు పవన్‌. ఇక, వారాహి యాత్రలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చాయి అని తెలిపారు. నీటి సమస్య, కొల్లేరులో విష పదార్దాల వ్యర్ధాల కలుషితం, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు సరిగా ఇవ్వడం లేదనే అంశం మా దృష్టికి వచ్చింది. చాలా మంది టీచర్లకు ఇప్పటికీ జీతాల్లేవు.. ఆదోని మండలంలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఓ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు.. ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు జీతాలు చెల్లించడం లేదు. టీచర్లకు జీతాలు ఎలా రావడం లేదో.. ఐఏఎస్‌లకూ జీతాలివ్వలేకపోతున్నారు.. రిటైర్డ్ ఐఏఎస్‌లకు పెన్షన్ సరిగా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి దేశ వ్యాప్తంగా ఐఏఎస్‌లకు వేతనాలు చెల్లిస్తారు. కానీ, ఆ ఫండ్ నుంచి జీతాలివ్వడం లేదు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు పవన్‌ కల్యాణ్‌.

Read Also: Raakshasa Kaavyam: ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి..విలన్లు కూడా గెలవాలి కదా!

ఏపీలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.. ఫ్లైట్లు కూడా రానివ్వని పరిస్థితి ఉందని ఆరోపించారు పవన్‌.. మేం ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని సీట్లు పోటీ చేయాలో వైసీపీ నేతలేం చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఢిల్లీకి వెళ్లి వైసీపీ నేతలు రాష్ట్రానికి మేలు చేకూరే పనుల గురించి మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ కేంద్రానికి ఎన్నిసార్లు వెళ్లినా రైతులకు మేలు కలిగే పనులేం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం పసుపు బోర్డు సాధించుకుంది. కాష్యూ బోర్డ్.. కోకో బోర్డ్ వంటి వాటి కోసం వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించదు..? అని నిలదీశారు. ఇక, జీ-20 సదస్సు జరుగుతున్నప్పుడు నక్క జిత్తులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే వైఖరికి అనుగుణంగానే టీడీపీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.. ఢిల్లీలో బీజేపీ పెద్దలు బిజీగా ఉండడం వల్ల టీడీపీతో పొత్తు విషయం చెప్పలేకపోయాం. బీజేపీతో సమన్వయ కమిటీ ఉంది. ఇటీవల కాలంలో బీజేపీతో కలిసి పోరాటాలు కూడా చేశామని వెల్లడించారు..

Read Also: Raakshasa Kaavyam: ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి..విలన్లు కూడా గెలవాలి కదా!

టీడీపీతో కలిశాక ప్రజలకు బలమైన భరోసా కలిగిందన్నారు పవన్‌.. తెలంగాణలో టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన.. సీఎంగా జగన్‌కు కేంద్రం ఇవ్వాల్సిన సహకారం ఇస్తోంది. ఏపీలో జరిగే పరిణామాలను కేంద్రం గమనిస్తూనే ఉంటుందన్నారు. జగన్ మీద ఉన్న కేసులు ఎత్తేసి.. కేసుల నుంచి ఉపశమనం కల్పిస్తే.. బీజేపీ జగన్‌కు సహకరిస్తున్నారని భావించాలని పేర్కొన్నారు. అధికార పార్టీ కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు సహకరిస్తోంది.. కానీ, దాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version