Site icon NTV Telugu

Pawan Kalyan: అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? ఆయనకు ఏ హాని కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత..!

Pawankalyan Janasena

Pawankalyan Janasena

Pawan Kalyan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలుపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారు.. చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్నారు.. మా పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ని చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం వైఖరిని తెలియచేస్తోందని దుయ్యబట్టారు.

Read Also: Raghava Reddy : ఆకట్టుకుంటోన్న ‘రాఘవ రెడ్డి’ ట్రైలర్

ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగం అని గుర్తుచేశారు పవన్‌ కల్యాణ్.. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుయాయులు న్యాయ పోరాటాలను తట్టుకోలేకపోతున్నారన్న ఆయన.. మూర్తి యాదవ్ కు ప్రాణ హాని తలపెట్టారని మండిపడ్డారు. విశాఖపట్నంలో రుషికొండను తొలిచేసి ప్యాలెస్ నిర్మించడంపై, దసపల్లా భూముల వ్యవహారం, టీడీఆర్ స్కామ్, టైకూన్ కూడలి మూసివేత, క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టి భారీ భవనాలు నిర్మించడం లాంటి అనేక వైసీపీ నేతల అక్రమాలపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారని.. జీవీఎంసీలో చోటు చేసుకుంటున్న అవినీతి చర్యలు, తప్పుడు ర్యాటిఫికేషన్లపై కౌన్సిల్ సమావేశాల్లో బలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. దీంతో.. అధికార పక్షం జీర్ణించుకోలేక బెదిరింపులకు దిగుతున్నారు.. మూర్తి యాదన్ కు ఏ చిన్నపాటి హాని కలిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version