Site icon NTV Telugu

69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్‌ సహా ఎవ్వరినీ వదలని పవన్‌..

Pawan

Pawan

69th National Film Awards: 69వ జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్‌ సినిమాలు దుమ్మురేపాయి.. వివిధ విభాగాల్లో ఏకంగా 10 అవార్డులను సొతం చేసుకున్నాయి.. సింహ భాగం.. ఆరు అవార్డులను ఆర్ఆర్ఆర్ మూవీ కైవసం చేసుకుంటే.. ఆ తర్వాత పుష్ప సినిమా రెండు అవార్డులను, కొండపొలం, ఉప్పెన చేరో అవార్డును దక్కించుకున్నాయి.. ఇక, అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.. జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు.. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ఆయన.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయన్నారు.

ఇక, పుష్ప చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’, ఈ సినిమాకుగాను విజేతలుగా నిలిచిన కీరవాణి, కాల భైరవ, శ్రీనివాస మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలోమన్, ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులు.. ఇలా అందరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు.. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం సంతోషకరం అన్నారు జనసేనాని.. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి, దర్శకుడు సానా బుచ్చిబాబుకీ అభినందనలు తెలిపారు.

పలు విభాగాల్లో అవార్డులు కైవశం చేసుకోవడంతోపాటు బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ని నిలిపిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌.. శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని చూపిన ‘రాకెట్రీ’ చిత్రాన్ని ఉత్తమంగా నిలిపిన దర్శకులు, నటులు ఆర్.మాధవన్ అభినందనీయులు. ఉత్తమ నటీమణులుగా నిలిచిన అలియా భట్ (గంగూభాయ్), కృతి సనన్ (మిమి) ప్రశంసలకు అర్హులుగా అభివర్ణించారు. ఇక, ‘ద కశ్మీర్ ఫైల్స్’ ముఖ్యమైన అవార్డులు దక్కించుకొంది. ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అభినందనలు అన్నారు. ఉత్తమ దర్శకుడిగా నిలిచిన మరాఠీ దర్శకుడు నిఖిల్ మహాజన్ (గోదావరి)కి ఉత్తమ గాయని శ్రేయ ఘోషల్‌కి, ఉత్తమ ఛాయాగ్రహకుడ ఆవిక్ ముఖోపాధ్యాయ్, హిందీ చిత్ర సీమ నుంచి అవార్డులకు ఎంపికైన సంజయ్ లీలా భన్సాలీ, పల్లవి జోషి, పంకజ్ త్రిపాఠీలు, వివిధ భాషల ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల నుంచి ఈ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version