NTV Telugu Site icon

Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్‌ సూటి ప్రశ్న

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై ఓ వ్యక్తి దాడికి తెగబడిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ఆయన ప్రశ్నించారు. పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌ డిమాండ్ చేశారు. సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికీ, దాష్టీకానికి ప్రతీక అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Also Read: Ambati Rambabu: చంద్రబాబు తప్పు వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం.. అంబటి సీరియస్

ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్‌పై ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వైదిక ఆచారాల్లో యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తామని.. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బందిపెట్టడం రాక్షసత్వమే అన్నారు. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నారని, జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇప్పుడు పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారన్నారు. ఇది స్థానిక నాయకుడు చేసిన దాడిగా సరిపుచ్చలేమన్నారు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలన్నారు. ఈశ్వరుని సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి గురించి, ఆలయాలపై దాడులు గురించి కేంద్రానికి నివేదిక అందిస్తామని పవన్‌ పేర్కొన్నారు.