అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు వెలిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొదటిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది.
17 కుటుంబాలు నివసించే గూడెంకి 9.6 కి.మీ పొడవున 217 విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున 5 బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు.
సుమారు రూ.80 లక్షల వ్యయంతో పర్వత అడవి ప్రాంతంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నాన్-పీవీజీటీ పథకం మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ సహకారంతో విద్యుత్ అందించారు.
విద్యుత్ స్తంభాలు తరలించడం నుంచి కొండల తవ్వకం వరకు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 15 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం గూడెం మొత్తం వెలుగులు జిమ్ముతోంది.
విద్యుత్ వెలుగులు వచ్చాక గిరిపుత్రులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గిరిపుత్రులు అందరూ లైట్స్, ఫాన్స్ వేసుకుని ఆనందంలో తేలియాడుతున్నారు.
