Pawan Kalyan Tour: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మొదటగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల అక్కడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడంతో, ఆ పాఠశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటనల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ కానున్నారు.
కాగా.. కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి చెందిన విషయం తెలిసిందే. మొదట అక్కడికే వెళ్లాలని పవన్ నిర్ణయించారు. అయితే.. విద్యార్థినుల మృతిపై నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరమన్నారు. కురుపాంలోని బాలికల గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి పిల్లలు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు చెప్పారన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు వివరించారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. విశాఖపట్నం కేజీహెచ్ లో 37 మంది విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకొని నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు వివరించారు. త్వరలో కురుపాం వెళ్ళి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు..
