NTV Telugu Site icon

Hima Varsha Reddy : శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట

Hima Varsha Reddy

Hima Varsha Reddy

ఆంధ్రప్రదేశ్‌లో అలూరు నియోజకవర్గం అంటే తెలియని వారుండరు. కర్నూలు జిల్లాలోని ఈ ఆలూరు నియోజకవర్గంతో ఓ కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. ప్రజలే శ్వాసగా ఆ కుటుంబం బతుకుతుంది. ఆ కుటుంబానికి మట్టి వాసన తెలుసు. ప్రజల నాడీ తెలుసు. అలానే.. ప్రజల సమస్యలను తమ సొంత సమస్యగా భావించి ముందుకు కదలడం తెలుసు. ఆ కుటుంబమే పాటిల్ శేషా రెడ్డి – నీరజా రెడ్డి కుటుంబం. పాటిల్ శేషా రెడ్డి మంచి విద్యావేత్త, గోల్డ్ మెడలిస్ట్. ప్రజలకు సేవా చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా అలుపెరగని సేవ చేశారు. కానీ.. ఫ్యాక్షన్ గొడవల్లో 1996లో హత్యకు గురయ్యారు. భర్త లేరనే బాధను గుండె లోతుల్లోనే దాచుకుని ఆలూరు నియోజకవర్గ ప్రజల కోసం ముందడుగు వేశారు పాటిల్ నీరజా రెడ్డి. భర్త మరణం తరువాత నియోజకవర్గ ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటూ వచ్చారు. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా.. మొక్కవోని ధైర్యంతో ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసం పోరాడారు. పాటిల్ నీరజారెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానం చూసిన మహానేత వైఎస్ఆర్‌ ఆమెను రాజకీయాల్లో ప్రోత్సహించారు.

2009లో పిలిచి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో పాటిల్ నీరజా రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు. భర్త ఆశయాల సాధన కోసం అలుపెరగకుండా పని చేశారు. ప్రజాసేవే శ్వాసగా రాజకీయం చేశారు. నియోజకవర్గ ప్రజల ఇంటి బిడ్డగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ.. దురదృష్టం వెంటాడింది. కాలయముడు కాటేశాడు. ఏప్రిల్ 16, 2023న భర్త పాటిల్ శేషా రెడ్డి వర్ధంతి కోసం హైదరాబాద్ నుంచి కర్నూలు బయల్దేరారు నీరజారెడ్డి. తెలంగాణలోని బాచుపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పాటిల్ నీరజా రెడ్డి మంచి విద్యావేత్తల కటుంబం నుంచి వచ్చారు. ఈమె తండ్రి జస్టిస్ రామ చెన్నారెడ్డి వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లి వాసి.

నీరజా రెడ్డి తండ్రి న్యాయ నిపుణుడు, విద్యావేత్త . 1988లో కర్నూలు జిల్లా తెర్నెకల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి చిన్న కుమారుడు శేషా రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శేషా రెడ్డి అగ్రికల్చర్‌ గోల్డ్ మెడలిస్ట్. భర్త చనిపోక ముందు, భర్త చనిపోయిన తరువాత భర్త అడుగుజాడల్లోనే నడిచి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయే వరకూ ప్రజాసేవలోనే గడిపారు పాటిల్ నీరజా రెడ్డి. తల్లితండ్రుల ఆశయాలను, తమ కుటుంబ వారసత్వాన్ని తన భుజాలకెత్తుకున్నారు పాటిల్ శేషా రెడ్డి – నీరజారెడ్డిల తనయ హిమ వర్షారెడ్డి. అమ్మ వైపు కుటుంబం నుంచి ఉన్నత విద్య వారసత్వం – తండ్రి వైపు కుటుంబం నుంచి ఉన్న రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్నారు హిమ వర్షా రెడ్డి.

ప్రజాసేవలో తల్లితండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికాలో ఉంటూ పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆమె మనసు, శ్వాస, ఆలోచన అంతా ఆలూరు నియోజకవర్గంలోనే.. ఆలూరు అంటే హిమ వర్షా రెడ్డికి ప్రేమ కాదు ప్రాణం. తండ్రి ఆలోచనలను – అమ్మ ఆశయాలను బతికించడానికి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు హిమ వర్షా రెడ్డి. పుట్టిన తరువాత తండ్రి చేతుల్లో ఆడుకునే భాగ్యం ఆ దేవుడు ఇవ్వలేదు. హిమ వర్షారెడ్డికి నాలుగేళ్ల వయసులోనే తండ్రి హత్యకు గురయ్యారు. మరోవైపు…అన్నీ తానై నడిపించిన తల్లి చనిపోయిందనే పుట్టెడు దుఖః.. కళ్ల నుంచి సునామీలా తన్నుకొచ్చే కన్నీరు. కానీ… ఆమె ఆలోచనల ముందు, ప్రజలకు సేవ చేయాలనే తపన ముందు ఆ కన్నీరు కంటి పొరలమాటునే ఇంకిపోతోంది. గుండెలో అగ్ని గోళాలు బద్దలవుతోన్నా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్నారు పాటిల్ శేషా రెడ్డి – నీరజా రెడ్డిల గారాల పట్టి హిమ వర్షా రెడ్డి. తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ప్రజల ముందుకు రావాలి అనుకుంటున్న హిమ వర్షా రెడ్డిని ప్రజలు ఆశీర్వదించే సమయం వచ్చేసింది. శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట.