Site icon NTV Telugu

Tirupati SVIMS Hospital: స్పృహలోకి రాగానే లేడీ డాక్టర్‌పై పేషెంట్ దాడి

Tirupati

Tirupati

Tirupati SVIMS Hospital: తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఓ రోగి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో డాక్టర్లు ధర్నాకు దిగారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రి నుంచి స్పృహలో లేని ఓ పేషెంట్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మద్యానికి బానిసగా మారిన బంగారు రాజు అనే వ్యక్తి.. తిరుమలలో మద్యం దొరక్కపోవటంతో స్పృహ కోల్పోయాడు. అతన్ని గమనించిన కొంతమంది అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం బంగారు రాజును అశ్వినీ ఆస్పత్రి నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి మార్చారు. శనివారం ఉదయమే అతన్ని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే స్విమ్స్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత బంగారు రాజు స్పృహలోకి వచ్చాడు. ఇక మెలకువలోకి వచ్చిన తర్వాత బంగారు రాజు వింతగా ప్రవర్తించాడు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా తనకు చికిత్స చేస్తున్న లేడీ డాక్టర్ మీద దాడికి ప్రయత్నించాడు. వార్డులో అందరుముందు ఆమెపై చేయి చేసుకున్నాడు.

Read Also: Crime: షాపింగ్ కి విపరీతంగా డబ్బు ఖర్చు చేసిన భార్య.. సుపారీ ఇచ్చి చంపించిన భర్త

అయితే చుట్టుపక్కల ఉన్న రోగుల బంధువులు, ఆస్పత్రిలోని వైద్యులు అడ్డుపడ్డారు. అతన్ని అడ్డుకున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మరోవైపు ఈ ఘటనతో స్విమ్స్ ఆస్పత్రిలోని వైద్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్లకే భద్రత లేదా అంటూ నిరసన చేపట్టారు. టీటీడీ ఈవో వచ్చి ఈ ఘటనపై సమాధానం చెప్పాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు.ఘటన స్దలానికి చేరుకున్న పోలిసులు… బంగార్రాజు పై కేసు నమోదు చేస్తామని అతను కోలుకోగానే విచారిస్తామని హామీ ఇచ్చిన డాక్టర్లు మాత్రమే ఈవో వచ్చి మాకు హామీ ఇవ్వాలని అప్పటిదాక ధర్నా అపడం కుదరదని పోలిసులకు తేల్చిచెప్పారు‌‌. ఈక్రమంలో పోలీసులకు, జూనియర్‌ వైద్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై డీఎస్పీ వెంకట నారాయణ స్పందించారు. తిరుపతి స్విమ్స్‌లో భద్రత పెంచుతామన్నారు. డాక్టర్‌పై దాడిచేసిన బంగార్రాజు మా అదుపులోనే ఉన్నాడు.. ప్రస్తుతం అతను వెంటిలేటర్ పై ఉన్నాడని, కోలుకున్న అనంతరం విచారణ చేపడతామని డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం స్విమ్స్‌లో డాక్టర్ల విధులకి ఏటువంటి ఆటంకం కలగకుండా పికెట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్విమ్స్‌లో అనుమానితుల రాకపోకలను పరిశీలించేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గత వారం స్విమ్స్‌లో ఓ రోగి అనుచితంగా ప్రవర్తించాడు అతనిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ రెండు కేసులను సీరియస్ గా తీసుకున్నాం,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి మీడియా కూడా తన వంతు పాత్ర పోషించాలని కోరారు.

Exit mobile version