Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..

Parvinder Awana

Parvinder Awana

Parvinder Awana: భారత జాతీయ క్రికెట్ జట్టు తరఫున కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మాజీ పేసర్ పర్వీందర్ అవానాకు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించింది. నోయిడాలోని హరౌలా గ్రామానికి చెందిన ఈ మాజీ ఫాస్ట్ బౌలర్‌ను జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 40 ఏళ్ల వయసున్న అవానా పేరును బోర్డు అధికారికంగా ప్రకటించగా, ఈ కమిటీలో కృష్ణ దాస్, రాకేష్ పటేల్, ఎన్. అర్జున్ యాదవ్ తదితరులను వివిధ జోన్ల సెలెక్టర్లుగా ఎంపిక చేశారు.

ఇక.. ‘హరౌలా ఎక్స్‌ప్రెస్’గా గుర్తింపు తెచ్చుకున్న పర్వీందర్ అవానా ప్రయాణం ఐపీఎల్ ద్వారా భారత జట్టు వరకు సాగింది. అయితే, దేశం తరఫున కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఆయనకు దక్కింది. 2004లో ‘ఈఎస్‌పీఎన్ మహీంద్రా స్కోర్పియో స్పీడ్‌స్టర్’ టెన్యంట్ హంట్‌లో గెలుపొంది అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచిన ఆయన, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ప్రముఖ మాజీ పేసర్ డెమియన్ ఫ్లెమింగ్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే, 2012 డిసెంబర్ 20న పూణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అవానా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ముంబైలో ఇంగ్లాండ్‌తోనే జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ బరిలోకి దిగారు. దురదృష్టవశాత్తు అదే ఆయన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత 2018లో కేవలం 31 ఏళ్ల వయసులోనే ఆయన అన్ని రకాల క్రికెట్ పోటీలకు వీడ్కోలు పలికారు.

దేశీయ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అవానా, 2007 నుంచి 2016 వరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 29.23 సగటుతో మొత్తం 191 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టారు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ ఆయన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఆయన కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టు తరఫున ఆడాడు. ముఖ్యంగా 2014 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తుది పోరులోనూ ఆయన బరిలో నిలిచారు. ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అవానా కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లతో పాటు భారత అండర్-19 జట్టుకు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు హై-పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్‌లలో కోచ్‌గా సేవలందించి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే అనుభవంతో జూనియర్ సెలక్షన్ కమిటీకి పెద్ద దిక్కుగా వ్యవహరించనున్నారు.