తెలుగు చిత్రసీమ మూగబోయింది. చిత్రసీమలోని తార ఆకాశంలో ధృవతారగా మిగిలిపోయింది. సూపర్ కృష్ణ మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటును కలిగించింది. ఆయన మృతిపై ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయాన్ని అభిమానులు, ప్రజలు సందర్శనార్థం ఉంచారు. అనంతరం మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ఈరోజు ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అయితే.. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు పీసీ రెడ్డి ద్వారా మాకు కృష్ణతో పరిచయమైందని తెలిపారు. ‘బంగారు భూమి’ సినిమాకి మోదుకూరి జాన్సన్ రచయితగా ఉన్నారని, ఆయన అందుబాటులో లేని కారణంగా మేము కొన్ని సీన్స్ రాశామన్నారు.
Also Read :Artemis 1 Moon Mission: మళ్లీ జాబిలిపైకి.. విజయవంతంగా దూసుకెళ్లిన మానవరహిత ‘ఆర్టెమిస్ 1’
ఆ సినిమాలోని ఒక సీన్ లో ‘పద్మా .. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు .. మట్టిని నమ్మితే మన నోట్లో ఇంత ముద్ద పెడుతుంది.. ఆ మట్టికి నమస్కారం చేయి’ అనే డైలాగ్ రాశాము. ఆ డైలాగ్ చెప్పిన కృష్ణగారు, అది ఎవరు రాశారని అడిగారట. ఆ డైలాగ్ రాసింది మేమని తెలిసి వరుస సినిమాలు ఇస్తూ వెళ్లారు. తన ప్రతి సినిమాకి రాయమని ముందుగా మా దగ్గరికే ఆయన పంపించేవారు. ఆయన హీరోగా చేసిన 54 సినిమాలకి మేము పనిచేశాము. మాతో ఎక్కువ సినిమాలకి రాయించిన హీరో కృష్ణగారు’ అని పరుచూరి గోపాలకృష్ణ కృష్ణతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. కృష్ణగారి మనసు బంగారమని, ఇండస్ట్రీలో ఆయన సాయం పొందని వారు అతి తక్కువమంది అనే చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. నేను సొంత ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తరువాత డబ్బులు సరిపోక ఆగిపోయినప్పుడు, ఆ విషయం తెలిసి డబ్బు పంపిన విశాలమైన హృదయం ఆయనకు సొంతమని ఆయన కొనియాడారు.
