NTV Telugu Site icon

Viral Video: పారాగ్లైడింగ్‌లో అపశ్రుతి.. విద్యుత్ స్తంభంపై ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులు.. వీడియో వైరల్

Paragliding

Paragliding

Viral Video: కేరళలోని ఓ బీచ్‌లో అవుట్‌డోర్ అడ్వెంచర్ చేయడానికి ప్లాన్ చేసిన ఇద్దరు పర్యాటకులు తమ పారాచూట్ అనుకున్న చోట దిగకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతంలోని వర్కాలలోని పాపనాశం బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్న ఓ వ్యక్తి, ఓ మహిళకు సంబంధించిన పారాచూట్‌ విద్యుత్ స్తంభానికి చిక్కుకోవడంతో వారు గట్టిగా కిందపడకుండా స్తంభాన్ని పట్టుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పారాగ్లైడర్లు 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన స్తంభం నుంచి కింద పడకుండా ప్రయత్నిస్తున్నారు.

ఇద్దరు వ్యక్తులు రక్షించబడటానికి ముందు దాదాపు రెండు గంటల పాటు స్తంభానికి వేలాడుతూనే ఉన్నారు. అగ్నిమాపక శాఖ వద్ద తగినంత ఎత్తులో నిచ్చెన లేనందున వాటిని తీసుకొచ్చేవరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా స్తంభం కింద పరుపులు, వలలను అధికారులు అమర్చారు. ఆ తర్వాత 28 ఏళ్ల మహిళ, పారాగ్లైడింగ్ శిక్షకుడు సురక్షితంగా రక్షించబడ్డారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ వర్కాలలోని తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Read Also: Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

పారాగ్లైడింగ్ ఘటనలు భయానక ప్రమాదాలుగా మారడం ఇది మొదటిసారేం కాదు. గతేడాది డిసెంబర్‌లో దేశంలో జరిగిన రెండు వేర్వేరు పారాగ్లైడింగ్ ఘటనల్లో 24 గంటల్లోనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో పారాగ్లైడింగ్ చేస్తుండగా 50 అడుగుల కింద పడి 50 ఏళ్ల దక్షిణ కొరియా వ్యక్తి మరణించగా, మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల పర్యాటకుడు హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని దోభి ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేస్తూ పడి మరణించాడు.