Papikondalu Tour Cancel: వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. రెండు రోజులపాటు పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే సోమవారం ఉదయం ఓ ప్రకటన జారీ చేశారు.. దీంతో, మంగళవారం, బుధవారం పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లను నిలిపివేసినట్టు పేర్కొంది పోచవరం పర్యాటక కంట్రోల్ రూమ్.. ఇటీవల కూడా పాపికొండల విహారయాత్ర బోట్లను నిలిపివేయగా.. ఇప్పుడు కూడా పర్యాటకులు సహకరించాలని కోరుతున్నారు అధికారులు.
Read Also: Vizag: విశాఖలో ఫ్లెక్సీల కలకలం..
కాగా, గతంలో కచ్చలూరు వద్ద విషాదం చోటు చేసుకుంది.. దేవి పట్నం మండల పరిధిలోకి వచ్చే కచ్చులూరు వద్ద గతంలో జరిగిన బోటు ప్రమాదంలో పర్యాటకులు 51 మంది మృతిచెంది తీవ్ర విషాదం నెలకొంది. ఆనాటి నుంచి ఇప్పటివరకు పాపికొండల యాత్రకు పలుమార్లు బ్రేక్‌లు పడుతూనే ఉన్నాయి.. 2019 సెప్టెంబరు 15న వశిష్ఠ పున్నమి రాయల్ బోటు దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 77 మంది ఉండగా.. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 51 మంది మృతి చెందిన విషయం విదితమే.