NTV Telugu Site icon

State Planning Commission: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే.. పంచాయతీరాజ్ గ్రూప్

Boinapally Vinod

Boinapally Vinod

State Planning Commission: రాష్ట్ర వ్యాప్త స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. మంగళవారం మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు వినోద్ కుమార్ ను కలిశారు. లోక్ సభ, రాజ్యసభలలో సిట్టింగ్, మాజీ ఎంపీల కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ గ్రూప్ ఉంటుందని, ఈ గ్రూప్ ద్వారా ఉభయ పార్లమెంటరీ సభల్లో జరిగే ముఖ్య ఘటనల సమాచారం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు సభ్యుల సమాచారం కోసం ఈ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా పంచాయతీరాజ్ గ్రూప్ ఉండాల్సిన అవశ్యకత ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Read Also: G20: జీ20 సమావేశాలపై డీజీపీ సమీక్ష.. ఈ నెల 28న ఫస్ట్ మీటింగ్

గ్రామ సర్పంచిగా, ఎంపిటిసి సభ్యులుగా, జెడ్పిటిసి సభ్యులుగా, ఎంపీపీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి రిజర్వేషన్ రోష్టర్ వల్ల గానీ, ఎన్నికల్లో ఓటమి చెందడం వల్ల గానీ, తిరిగి పోటీ చేయలేక పోవడం వంటి పలు కారణాల వల్ల మాజీలుగా ఉంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలకు అతీతంగా ఒకే వేదికగా ఉంచే విధంగా పంచాయతీ రాజ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వినోద్ కుమార్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు, స్థానిక సంస్థల సమగ్ర సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించేందుకు పంచాయతీ రాజ్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సమాచారాన్ని గ్రామస్థులకు చేరవేయడానికి పంచాయతీ రాజ్ గ్రూప్ చాలా ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ తెలిపారు. పంచాయతీ రాజ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.