టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.. కడప ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసిన కుట్రలో బీజేపీ పడిందన్నారు.. ఆ కుట్రలో భాగంగానే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని.. ఈ పొత్తులో పలువురు బీజేపీ సీనియర్ నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విశాఖపట్నంలో చంద్రబాబు టీడీపీ, బీజేపీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎవరి నోట్లో మట్టి కొట్టడానికి బద్వేలులో రోశన్నకు టికెట్ కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను టీడీపీ అధినేత నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
కడప గడ్డపై విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేశామని, ఆ ఉద్యమం సమయంలో అరెస్ట్ అయ్యి బేడీలతో పరీక్షలు రాసిన వ్యక్తి తానని తెలిపారు పనతల సురేష్.. బద్వేలు ఉప ఎన్నికల్లో నికార్సైన బీజేపీ కార్యకర్త అవసరం అని నన్ను ఎన్నికల్లో నిలిపారన్నారు. ఆ ఉప ఎన్నికల్లో నాకు 22 వేల ఓట్లు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి బద్వేలు టిక్కెట్ కేటాయించారని తెలిపారు. బద్వేలు బీజేపీ టిక్కెట్ రాత్రికి రాత్రి టీడీపీ కార్యకర్తకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు లో బీజేపీ సీనియర్ నేతలైన సోము వీర్రాజు, సుజనా చౌదరి, విష్ణు వర్ధన్ రాజులతో పాటు అనేక మందికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం పునరాలోచించాలిని కోరారు. చంద్రబాబు నాయుడు పద్దతి మార్చు కోక పోతే, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దళితులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీకి ఓట్లు వేయద్దని ప్రచారం చేస్తానని హెచ్చరించారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.