టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు ఊరట లభించింది. గాజువాక మెయిన్ రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేతకు బాధ్యులపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యక్షంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అప్పటి డిప్యూటీ సిటీ ప్లానర్ నరేందర్ రెడ్డి, ప్లానింగ్ సూపర్ వైజర్ వరప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వినయ్ ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే భవన నిర్మాణాల కోసం పల్లా శ్రీనివాస్ అనుమతులు పొందారు. 2021 ఏప్రిల్ 25న అర్ధరాత్రి వేళ జీవీఎంసీ సిబ్బంది వెళ్లి భవనాన్ని కూల్చివేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పల్లా శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా వ్యవహరించారని కేసు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లా శ్రీనివాస్ కమర్షియల్ బిల్డింగ్ కూల్చివేత ఘటనపై విచారణ జరిగింది. ఏడాది తర్వాత రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసినందుకు బాధ్యులైన అధికారులపై వేటు పడింది. అప్పటి జీవీఎంసీ కమిషనర్ సృజన కూడా బాధ్యవహించాల్సిందే అంటున్నారు పల్లా.
